Upcoming Cars: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తుంటే కొద్ది కాలం వెయిట్ చేయండి. ఎందుకంటే త్వరలో ఒకటి కాదు రెండు కాదు మార్కెట్లోకి ఏకంగా 4 కొత్త ఎలక్ట్రిక్ కార్లు విడుదల కానున్నాయి.
మారుతి సుజుకి ఈ-విటారా
మారుతి సుజుకి కంపెనీ నుంచి రానున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ఈ కారును మారుతి సుజుకి ప్రదర్శించింది. ఈ కారులో 49kWh బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కారు విడుదల తేదీని కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ, త్వరలోనే ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎంజీ ఎం9
ఎంజీ నుంచి రానున్న ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీని కూడా ఆటో ఎక్స్‌పో 2025లోనే ప్రదర్శించారు. ఈ కారును ఎంజీ సెలెక్ట్ రిటైల్ నెట్‌వర్క్ ద్వారా మన దేశంలో విక్రయించనున్నారు. ఈ కారు 7 సీటింగ్ ఆప్షన్, 90kWh బ్యాటరీతో విడుదల కాబోతుంది. మీడియా కథనాల ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కారు 430 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కారు ధర ఎంత ఉంటుందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు.
ఎంజీ సైబర్‌స్టర్
ఎంజీ నుంచి రానున్న ఈ కారు 2-డోర్ స్పోర్ట్స్ కారు. ఈ కారులో 77kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 443 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మనదేశంలో విడుదలైన తర్వాత ఈ ఎలక్ట్రిక్ కారును ఎంజీ9తో పాటు ఎంజీ సెలెక్ట్ ద్వారా విక్రయించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
టాటా హారియర్ ఈవీ
టాటా మోటార్స్ నుంచి రానున్న ఈ పాపులర్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా త్వరలో విడుదల కానుంది. టాటా హారియర్ ఈవీ డ్యూయల్ మోటార్ సెటప్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో విడుదల కానుంది. బ్యాటరీ, డ్రైవింగ్ రేంజ్ గురించి కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ కార్ల రాకతో భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ మరింత ఊపందుకోనుంది.