TVS XL100: భారత టూవీలర్ మార్కెట్లో మోపెడ్ TVS XL100 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు ఎక్కువగా వినియోగించే దీనికి ఇప్పుడు పట్టణాల్లో కూడా ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా డెలివరీ సేవలు, చిన్న వ్యాపార కార్యకలాపాలు, రోజువారీ రవాణా అవసరాల కోసం దీని వినియోగం పెరుగుతుండటంతో అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఈ మోపెడ్ అమ్మకాలు ఎలా ఉన్నాయి? గత ఏడాది పోలిస్తే ఎంత వృద్ధి సాధించింది?
ఇటీవల వెలువడిన అమ్మకాల గణాంకాల ప్రకారం.. TVS XL 100 మోపెడ్‌లు 2025 మే నెలలో దేశవ్యాప్తంగా 37,264 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అయితే 2026 మే నెలలో ఈ సంఖ్య ఏకంగా 48,569 యూనిట్లకు చేరుకుంది. అంటే ఏడాదిలో 11,305 అదనపు యూనిట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ పెరుగుదల వార్షిక ప్రాతిపదికన సుమారు 30.34 శాతం వృద్ధిని సూచిస్తోంది.
TVS XL 100 విజయానికి ప్రధాన కారణం గ్రామీణ మార్కెట్‌లో దీనికి ఉన్న బలమైన స్థానం. వ్యవసాయ పనులు, పాలు, కూరగాయలు, ఇతర సరుకుల రవాణా కోసం ఈ మోపెడ్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు, ఎక్కువ లోడ్ మోయగల సామర్థ్యం, సులభమైన డ్రైవింగ్ అనుభవం కారణంగా గ్రామీణ వినియోగదారులు దీనిని మొదటి ఎంపికగా భావిస్తున్నారు.
అయితే ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో కూడా XL 100కు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ-కామర్స్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, చిన్న వ్యాపారులు, స్థానిక సరుకు రవాణా సేవలు అందించే వారు ఈ మోపెడ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఇంధన వ్యయం, తక్కువ నిర్వహణ ఖర్చు ఉండటం వల్ల రోజువారీ వినియోగానికి ఇది అనువైన వాహనంగా మారింది.
దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో TVS XL 100 వంటి మోపెడ్‌లు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలగడం దీని ప్రధాన ఆకర్షణగా మారింది. XL 100 అమ్మకాల పెరుగుదల TVS Motor Companyకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. కంపెనీ మొత్తం టూవీలర్ పోర్ట్‌ఫోలియోలో ఈ మోపెడ్ కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణ మార్కెట్‌లో కంపెనీ ఆధిపత్యాన్ని నిలబెట్టడంలో XL 100 ప్రధాన బలంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం చిన్న వ్యాపారాలు, డెలివరీ సేవలు, గ్రామీణ రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మోపెడ్‌లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగకరతను అందించే వాహనాలపై వినియోగదారుల ఆసక్తి కొనసాగితే TVS XL 100 అమ్మకాలు రానున్న నెలల్లో కూడా బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
