Samosa Singh: “ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే. వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే” ఈ సూక్తిని ఈ దంపతులు ఆచరణలో పెట్టారు. కార్పొరేట్ కంపెనీల్లో లక్షల వేతనాలు ఇచ్చే కొలువులను ఎడమ కాలితో తన్నేశారు.. రోజుకు 12 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంతకీ వారు ఏం చేస్తున్నారంటే.
శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్ అనే దంపతులు పెళ్లి కాకముందు హర్యానాలో బీటెక్ బయోటెక్నాలజీ చదువుకున్నారు. అప్పుడే వారిద్దరికీ పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం శిఖర్ 2015 లో హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో ఎంటెక్ లో జాయిన్ అయ్యాడు. కోర్సు పూర్తయిన తర్వాత అతడు ప్రఖ్యాత బయోకాన్ కంపెనీలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా జాయిన్ అయ్యాడు. . ఈలోగా నిధి కూడా గుర్గావ్ లో ఓ ఫార్మా కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా జాయిన్ అయింది. అప్పట్లో ఆమె వేతనం 17000. ఆ తర్వాత అది 30 లక్షల వార్షిక వేతనానికి పెరిగింది. ఇద్దరికీ మంచి వేతనాలు, పైగా కార్పొరేట్ కంపెనీలో కొలువులు కావడంతో పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఒకరోజు సరదాగా ఇద్దరు కలిసి సినిమాకు వెళ్లారు. అక్కడ ఫుడ్ కోర్టులో సమోసా కోసం ఒక బాలుడు ఏడవడం కనిపించింది. అయితే ఆ దృశ్యం నిధికి సాధారణంగా కనిపించినప్పటికీ శిఖర్ దృష్టిని మాత్రం అమాంతం మార్చేసింది. వెంటనే అతడు ఆలోచనలో పడ్డాడు. ఈ విషయాలను భార్యతో పంచుకోలేదు.
అయితే హఠాత్తుగా ఒకరోజు ఉద్యోగం మానేస్తున్నట్టు భార్యతో చెప్పాడు. తనకున్న ఆలోచనను ఆమెతో పంచుకున్నాడు. అప్పటిదాకా వారు సంపాదించిన డబ్బును మొత్తం వారు ఆ వ్యాపారంలో పెట్టారు. నిధి కూడా భర్తకు తోడుగా ఉండేందుకు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసింది. సీన్ కట్ చేస్తే “సమోసా సింగ్” పేరుతో వ్యాపారం ప్రారంభమైంది. రొటీన్ సమోసాగా కాకుండా అద్భుతమైన స్నాక్ గా రూపొందించారు. అందులోనూ పలు వెరైటీలతో వినియోగదారుల మదిని దోచుకునే విధంగా తయారు చేశారు. ఈ ఐడియా సూపర్ క్లిక్ కావడంతో వారి వ్యాపారం అమాంతంగా పెరగడం ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 “సమోసా సింగ్” ఔట్ లెట్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు 12 లక్షల ఆదాయం వస్తోంది. బట్టర్ చికెన్ సమోసా, కడాయి బట్టర్ పన్నీర్ చికెన్ సమోసా వంటి వెరైటీలను కూడా వీరి ఔట్ లెట్ లలో సర్వ్ చేస్తున్నారు.