Car Prices: నెల క్రితం ప్రకటించినట్లుగానే.. దేశీయ దిగ్గజ కార్ల కంపెనీలు కొత్త ఏడాది ప్రారంభంలోనే కార్ల ధరలను పెంచేశాయి. మారుతీ సుజుకీ తాము ఉత్పత్తి చేస్తున్న కార్ల ధరలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయని తెలిపింది. ముడి సరుకుల ధరలు పెరిగిన కారణంగానే కార్ల ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కార్ల ధరల పెరుగుదల 0.45 శాతం ఉంటుందని కంపెనీ తెలిపింది.
ధరల శ్రేణి ఇలా..
మారుతీ సుజుకీ విక్రయించే కార్ల ధరలు రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల వరకు ఉన్నాయి. సుజుకీ ఆల్టో, సెలారియో, స్విఫ్ట్, డిజైర్, బాలినో, ఎర్టిగా, ఎక్స్‌ల్‌ఎన్6, ఓమినీ, క్లేజ్, ఇన్విక్టో వంటి మోడళ్లు మారుతీ సుజుకీ తయారు చేస్తోంది.
పెరిగిన మారుతి షేర్ ధర..
కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించగానే స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్ల ధర పెరిగింది. మార్కెట్ ప్రారంభ సెషన్‌లోనే 1.5 శాతం లాభవపడ్డాయి. మారుతీ సుజుకీ గతేడాది ఏప్రిల్ 1న కార్ల ధరలను పెంచింది. 2023 డిసెంబర్ నాటికి కంపెనీ 1,37,551 యూనిట్లను విక్రయించింది. 2022 డిసెంబర్‌తో పోలిస్తే 2023లో కార్ల విక్రయాలు 1.28 శాతం తగ్గాయి. కానీ 2023 క్యాలెండర్ ఇయర్‌లో మాత్రం రికార్డు స్థాయిలో 2 కోట్ల వాహనాలను విక్రయించినట్లు సమాచారం.
వోల్వో ఇండియా కూడా..
వోల్వో ఇండియా కూడా తన కార్ల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వోల్వో ఎలక్ట్రిక్ కార్ల ధరలను మాత్రం పెంచడం లేదని తెలిపింది. 2030 నాటికి పూర్తిగా విద్యుత్ కార్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వోల్వో వాటి ధరలను పెంచకూడదని నిర్ణయించింది.
టాటా మోటార్స్ కూడా..
మరో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ధరలను ఇటీవల పెంచింది. ముడి పదార్ధాల ధరల పెరుగుదల కారణంగానే ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. వోక్స్ వ్యాగన్, హ్యుండాయ్, డ్యుకాటీ, మెర్సిడెస్‌బెంజ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి సైతం ఈనెలలో తమ కంపెనీ కార్ల ధరలు కూడా పెంచుతామని ప్రకటించాయి.