Gold Price 2 Lakh: బంగారం ధర రేసుగుర్రం లాగా పరుగులు పెడుతోంది. ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా దూసుకుపోతోంది. వాస్తవానికి బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుతుందని వ్యాపారులే కాదు, దాని తయారీదారులు కూడా అంచనా వేయలేకపోయారు.. ఇప్పటికీ బంగారం ధర పెరుగుదల చూసి తయారీదారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరుగుదల ఎక్కడ వరకు వెళ్తుందనే విషయాన్ని వారు కూడా చెప్పలేకపోతున్నారు.
సరిగ్గా ఏడాది క్రితం బంగారం ధర 10 గ్రాములకు 80,000 వరకు ఉండేది. కానీ ఆ తర్వాత బంగారం ధర పూర్తిగా మారిపోయింది. అంచనాలకు అందకుండా పెరిగిపోయింది. ఒక దశలో లక్ష మార్కు అందుకోవడాన్ని జనాలు ఆశ్చర్యంగా చూస్తే.. ఇప్పుడు ఏకంగా రెండు లక్షల మార్కు కూడా అందుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది ఇప్పట్లో సాధ్యం కాదని.. 2030 వరకు 10 గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,770 పలుకుతోంది.. అమెరికా కరెన్సీ అప్పులు పెరగడం.. గ్లోబల్ అస్థిరత కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. 2027 లోనే బంగారం ధర రెండు లక్షలకు చేరుకోవచ్చని వ్యాపారులు మరో విధమైన అంచనా వేస్తున్నారు.
బంగారం తయారీ అవుతున్న దేశాలలో విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు అమెరికా కరెన్సీ అనేక ఆటుపోట్లకు గురవుతోంది. ప్రపంచ దేశాల మీద లేనిపోని టారిఫ్ లు విధిస్తూ అమెరికా రాక్షస ఆనందం పొందుతోంది. దీనికి తోడు డాలర్ విలువ పడిపోవడం పెట్టుబడిదారులలో సరికొత్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగియలేదు. పశ్చిమసియాలో పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదు. దీంతో పెట్టుబడిదారులు బంగారాన్ని మాత్రమే అత్యంత శ్రేయస్కరమైన ఇన్వెస్ట్ ఎలిమెంట్గా చూస్తున్నారు. అందువల్లే బంగారం మీద విపరీతంగా పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ధరలు అంతకుమించి అనే స్థాయిలో పెరిగిపోతున్నాయి.
బంగారం ధరలు పెరగడం వల్ల శుభకార్యాలు, ఇతర వేడుకలు చేసుకునేవారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా భారతీయుల వివాహ వేడుకలలో కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. కాకపోతే ఆ బంగారం ధర ఈ స్థాయిలో పెరగడంతో చాలామంది బడ్జెట్ మారిపోతుంది. గతంలో భారీగా బంగారాన్ని కొనుగోలు చేసే వారు సైతం తక్కువ మొత్తంలో కొంటున్నారు. మరికొందరు మాత్రం బంగారం కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. పరిస్థితులు మారిపోతే బంగారం ధరలు కూడా తేడాలు వస్తాయని సూచిస్తున్నారు.