https://oktelugu.com/

Adani Group: అయ్యా బైడన్ గారూ..కాస్త మీ ఎఫ్బీఐ ని పక్కనపెట్టి.. తెలుగు మీడియాకు అవకాశం ఇద్దురు!

మీడియా మీడియా లాగా ఉండాలి. రాజకీయ రంగులు పోసుకుంటూనే సమాజానికి అసలైన ప్రమాదం. దేశం మొత్తం ఏమో గాని.. తెలుగు నాట మాత్రం మీడియా రాజకీయ రంగులు పూసుకొని రంకెలు వేయడం గత కొంతకాలంగా నిర్లజ్జగా కొనసాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో అది తారాస్థాయికి చేరి.. మీడియా అంటేనే కాండ్రించి ముఖాన ఉమ్మి వేసే పరిస్థితి నెలకొంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 22, 2024 / 03:34 PM IST

    Adani Group(5)

    Follow us on

    Adani Group: అదానీ కంపెనీ వ్యవహారాలలో న్యూయార్క్ అధికారులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. లంచాలు ఇచ్చారని.. అక్రమాలకు పాల్పడ్డారని.. అవినీతి వ్యవహారాలకు తెర లేపారని న్యూయార్క్ అధికారులు తమ అభియోగాలలో పేర్కొన్నారు. వాస్తవానికి ఇవి అభియోగాలు మాత్రమే.. నేర నిరూపణలు కాదు.. నేర నిరూపణ జరిగిన తర్వాత అప్పుడు అదానీ మీద ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. అడ్డగోలుగా దుమ్మెత్తి పోసుకోవచ్చు. కానీ ఈ విషయాన్ని మర్చిపోయి తెలుగునాట ఓ వర్గం మీడియా రెచ్చిపోయింది. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో తమ పరిధి దాటి రాసుకుంటూ పోయింది. అదానీ తెలంగాణ ముఖ్యమంత్రి కి 100 కోట్లు విరాళం ఇచ్చారని.. అంతకుముందు దావోస్ లో 12000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు మార్చుకున్నారని ఓ మీడియా రాసింది. కానీ ఇదే మీడియా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనమైందని, కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయని, వేల కోట్ల పెట్టుబడులు రావడంలేదని పెడబొబ్బలు పెట్టింది. మళ్లీ ఇదే మీడియా ఆదాని వ్యవహారం తెరపైకి రాగానే 12,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని రాసింది.. అంటే ఇక్కడ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే పత్రిక రాసింది. కనీసం తాను రాసిన వార్తల మీద కూడా నిలబడలేకపోయింది. ఇక 100 కోట్లు విరాళం ఇచ్చారని రాస్తున్నప్పుడు.. అవి ప్రభుత్వ ఖజానాకే కదా చేరేది.. అవేవీ రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఖాతాలోకి వెళ్ళవు కదా.. ఈ చిన్న లాజిక్ ను ఆ మీడియా మర్చిపోయింది.. పైగా బురద చల్లడం దర్జాగా చేసుకుంటూ పోయింది.

    Adani Group(6)

    ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదానికి అడ్డగోలుగా మేళ్లు చేకూర్చారని.. వనరులు మొత్తం దోచి పెట్టారని ఓ మీడియా రాసింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి ఏకంగా ఆదాని 12000 కోట్లకు పైగా చెల్లింపులు చేశారని స్పష్టం చేసింది. ఇప్పుడు న్యూయార్క్ అధికారులు మోపుతున్న అభియోగాలు అవేనని సంచలన రాతలు రాసింది. అయితే ఇక్కడ కేసు నమోదయింది అమెరికాలో.. అభియోగాలు మోపింది న్యూయార్క్ అధికారులు. వాటిని నిరూపించాల్సింది కూడా వారే. పైగా ఈ అభియోగాలు పూర్తి నిరాధారమని ఆదాని గ్రూప్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. కానీ అప్పటిదాకా ఆగలేని తెలుగు మీడియా.. అడ్డగోలుగా రాతలు రాసేసింది. చివరికి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు చేయలేని పనిని కూడా చేసి పడేసింది. అదానీ దొంగ అని… రేవంత్ రెడ్డి ముడుపులు తీసుకున్నారని.. జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు వెనకేసుకున్నారని రాసి పడేసింది. మరి ఇదే దూకుడు.. ఇదే సచ్చిలత మిగతా విషయాలలో ఆ పత్రికలు ఎందుకు చేయవు? ఆ చానల్స్ ఎందుకు ప్రసారం చేయవు? ఇలాంటి పనులు చేస్తున్నాయి కాబట్టే ఆ మీడియా హౌస్ లు పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయి. పార్టీ మౌత్ పీసులుగా దిగజారిపోయాయి. అందువల్లే జనం వాటిని దేకడం లేదు. అవి ప్రచురించే వార్తలను, ప్రకారం చేసే కథనాలను పట్టించుకోవడం లేదు.