Tata Tiago new features and price: భారతీయ ఆటోమోబైల్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Tata Tiago.. ఇప్పుడు మరింత ఆధునిక రూపంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. 28 మే 2026న ఈ కారు అధికారికంగా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు ఈ కారుపై అంచనాలను భారీగా పెంచాయి. గతంతో పోలిస్తే … ఈసారి టియాగోలో అత్యంత అధునాతనమైన , ప్రీమియం ఫీచర్లను జోడించినట్లు స్పష్టమవుతోంది. ఇది ఎంట్రీ లెవల్ కార్ల విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశం ఉంది. మరి ఈ కొత్త కారులో ఏమేం ఉన్నాయంటే?
ఈసారి టాటా కంపెనీ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పెట్రోల్, సీఎన్‌జీ (CNG), ఎలక్ట్రిక్ (EV) వేరియంట్లను ఒకేసారి లాంచ్ చేస్తోంది. డిజైన్ పరంగా చూస్తే.. బాహ్య రూపంలో చిన్న చిన్న మార్పులు చేసి కారుకు ఒక ప్రీమియం లుక్ ను ఇచ్చారు. కొత్తగా రూపొందించిన గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్ తో కారు మొత్తం ఫినిషింగ్ చూస్తుంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కారు మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, రెనాల్ట్ క్విడ్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
కొత్త టియాగో కారులో Interior పరంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. నాణ్యమైన మెటీరియల్, సౌకర్యవంతమైన సీట్లు, ఆధునిక డ్యాష్‌బోర్డ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కారులో అందరినీ ఆశ్చర్యపరిచే అతిపెద్ద ఫీచర్ ‘360-డిగ్రీ వ్యూ కెమెరా’. సాధారణంగా లగ్జరీ SUVలకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను, ఒక ఎంట్రీ లెవల్ కారులో టాటా అందించడం గొప్ప విషయం. దీనివల్ల ఇరుకైన సందుల్లో పార్కింగ్ చేయడం, ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేయడం డ్రైవర్లకు చాలా సులభతరం కానుంది.
టాటా అంటేనే భద్రతకు మారుపేరు. టియాగో ఇప్పటికే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మార్కెట్లో తన పట్టు నిలుపుకుంది. ఈ కొత్త మోడల్‌లో కూడా సేఫ్టీ ఫీచర్లను మరింత బలోపేతం చేసినట్లు తెలుస్తోంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్ట్రక్చరల్ స్టెబిలిటీ వంటివి దీనికి అదనపు బలం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ, సామాన్యులకు అందుబాటులో ఉండేలా, ఈ కారు ధర సుమారు రూ. 5.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
