Tata Sierra : భారతదేశపు దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలోనే మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన SUV హారియర్ ఎలక్ట్రిక్ వెర్షన్ హారియర్ ఈవీని విడుదల చేయనుంది. అంతేకాదు, టాటా మరొక ఎలక్ట్రిక్ కారును కూడా తుది మెరుగులు దిద్దుతోంది. ఇది సియెర్రా ఈవీ (Tata Sierra EV) పేరుతో రానున్న ఒక ఎలక్ట్రిక్ SUV. కొన్ని సంవత్సరాల క్రితం టాటా సియెర్రాను కంబషన్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ రెండింటిలోనూ తిరిగి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
2020 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో మొదటిసారి కనిపించిన సియెర్రా ప్రీ-ప్రొడక్షన్ ప్రోటోటైప్‌ను ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించారు. ఇటీవల ఈ SUV టెస్ట్ మ్యూల్స్‌ను అనేక సందర్భాల్లో గుర్తించారు. అప్పట్లో దాని బాహ్య డిజైన్ గురించి కొంత సమాచారం తెలిసింది. కానీ ఇప్పుడు దాని ఇంటీరియర్ గురించి కొత్త వివరాలు బయటకు వచ్చాయి.
పేటెంట్ కోసం దరఖాస్తు
మీడియా నివేదికల ప్రకారం.. టాటా మోటార్స్ డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ కోసం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు పేటెంట్ దరఖాస్తును దాఖలు చేసింది. డాష్‌బోర్డ్ డిజైన్ టాటా కార్ల కొత్త శ్రేణిని పోలి ఉన్నప్పటికీ, సెంటర్ కన్సోల్ టన్నెల్ మాత్రం టాటా ప్రస్తుత మోడళ్ల నుంచి పూర్తిగా భిన్నంగా ఉంది.
ఇంటీరియర్ ఎలా ఉండబోతోంది
పేటెంట్ డిజైన్‌లో ఒక సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కంప్లీట్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, AC వెంట్స్, టాటా కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో కూడిన ప్రసిద్ధ డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉండబోతుంది. ఇందులో బ్రాండ్ లోగో కోసం బ్యాక్‌లిట్ స్క్రీన్ ఉంది. డాష్‌బోర్డ్ ఒక సొగసైన, స్టెప్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిని కాన్సెప్ట్ మోడల్ నుంచి తీసుకున్నారు.
పవర్‌ఫుల్ ఇంజన్
టాటా సియెర్రా ICE, EV ఉత్పన్నాలలో రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. మొదటిది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులో సరికొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 168 bhp శక్తిని, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు హారియర్, సఫారిలో ఉన్న 2.0-లీటర్ Kryotec డీజిల్ ఇంజన్ కూడా ఉంటుంది. ఈ ఇంజన్ 168 bhp శక్తిని, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.