Swiggy And Zomato: కేంద్రం జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిస్తుంటే.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో మాత్రం ఆ తగ్గించిన సొమ్ములో కొంత తమ ఖాతాల్లోకి వేసుకుంటున్నాయి. జీఎస్టీ శ్లాబ్‌లు ఎత్తివేసి, కొత్త ధరలు ప్రకటించిన రోజే ఫుడ్ డెలివరీ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్ చార్జీలు పెంచేశాయి. కస్టమర్లకు ఆర్థిక భారాన్ని మోపాయి. స్విగ్గీ ఆర్డర్‌కు రూ.15గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించగా, జొమాటో రూ.12 (జీఎస్టీతో కలిపి)గా పెంచింది. పండుగ సీజన్‌లో పెంచడం ద్వారా మరింత ఎక్కువ ఆదాయం పొందేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
2023 నుంచి చార్జీల వసూలు..
స్విగ్గీ, జొమాటో తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను 2023లో రూ.2 నుంచి ప్రారంభించాయి. అప్పటి నుంచి, ఈ ఫీజు క్రమంగా పెరుగుతూ వచ్చింది. స్విగ్గీ ఈ ఫీజును గత మూడు వారాల్లో మూడు సార్లు పెంచింది. ఆగస్టు 14న రూ.14కి, తర్వాత రూ.12కి తగ్గించి, ఇప్పుడు రూ.15కి పెంచింది. జొమాటో కూడా రూ.10 నుంచి రూ.12కి పెంచింది, దీనిని పండుగ సీజన్ డిమాండ్‌కు అనుగుణంగా సమర్థించింది. ఈ ఫీజు డెలివరీ ఛార్జీలు, రెస్టారెంట్ ఛార్జీలు, జీఎస్టీ అదనంగా వసూలు చేస్తాయి.
కస్టమర్లపై జేబుకు కోట్లలో చిల్లు..
స్విగ్గీ రోజుకు సుమారు 20 లక్షల ఆర్డర్లు, జొమాటో 23–25 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాయి. స్విగ్గీ ఒక్క ఆర్డర్‌కు రూ.15 ఫీజుతో రోజుకు రూ.3 కోట్ల అదనపు ఆదాయాన్ని, సంవత్సరానికి రూ.216 కోట్లను తెస్తుంది. ఇక జొమాటో రూ.12 ఫీజు రోజుకు రూ.3 కోట్ల వరకు ఆదాయాన్ని జనరేట్ చేస్తుంది. ఈ ఫీజు పెంపు కస్టమర్లకు ఆర్డర్‌కు సగటున రూ.500–రూ.700 విలువైన ఆహార ఆర్డర్లపై అదనపు భారాన్ని కలిగిస్తుంది. ఈ పెంచిన ధరలు, ముఖ్యంగా స్విగ్గీ ఒక్క ఆర్డర్‌కు రూ.15 వసూలు చేయడం, కస్టమర్లలో అసంతృప్తిని కలిగిస్తోంది, అయితే పండుగ సీజన్ సౌలభ్యం కోసం చాలా మంది ఈ ధరలను భరిస్తున్నారు.
వ్యాపార వ్యూహం..
స్విగ్గీ, జొమాటో ఈ ఫీజు పెంపును లాభదాయకతను పెంచడానికి ఒక వ్యూహంగా ఉపయోగిస్తున్నాయి. స్విగ్గీ 2025 జూన్ త్రైమాసికంలో రూ.1,197 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం రూ.611 కోట్ల నుంచి దాదాపు రెట్టింపు. దీనికి ప్రధాన కారణం ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ వ్యాపారంలో భారీ పెట్టుబడులు. జొమాటో కూడా బ్లింకిట్ విస్తరణ కోసం భారీ ఖర్చులను ఎదుర్కొంటోంది, దీని వల్ల దాని నికర లాభం 2025 జూన్ త్రైమాసికంలో 90% తగ్గి రూ.25 కోట్లకు చేరింది. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు ఈ కంపెనీలకు ఆదాయాన్ని పెంచడానికి, లాభాలను స్థిరీకరించడానికి ఒక సులభమైన మార్గంగా కనిపిస్తోంది.
స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో డ్యూయోపొలీగా ఉన్నాయి, కానీ రాపిడోకు చెందిన ఓన్లీ వంటి కొత్త ప్లేయర్లు పోటీని తీవ్రతరం చేస్తున్నాయి. ఓన్లీ, రెస్టారెంట్లకు 8–15% తక్కువ కమీషన్ రేట్లను అందిస్తూ, స్విగ్గీ, జొమాటో 16–30% కమీషన్‌లకు పోటీగా నిలుస్తోంది. ఈ పోటీ నేపథ్యంలో, ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు కంపెనీలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించినప్పటికీ, కస్టమర్‌ను ప్రభావితం చేయవచ్చు.