Surat Diamond Bourse: ధనం మూలం ఇదం జగత్.. ప్రపంచంలో జరిగే ప్రతి పనీ డబ్బు చుట్టే ముడిపడి ఉంటుంది. ఆ డబ్బు చుట్టూ పరిభ్రమిస్తూ వ్యాపారాలు జరుగుతాయి. ఆ వ్యాపారాలకు సంబంధించి ప్రపంచంలో అనేక వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి.. అటువంటి వాటిలో అమెరికాలోని “పెంటగాన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్” అతిపెద్దది. అప్పట్లో ఆల్ ఖైదా బాంబు దాడులు చేసినప్పటికీ అది త్వరగానే కోలుకుంది. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతోంది. అయితే ఇకనుంచి పెంటగాన్ ను ఆ ఘనత దక్కకపోవచ్చు. దాని వైభవం గతం కింద మారిపోవచ్చు.. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు వెళ్లి వ్యాపారాలు చేసే వారంతా ఇండియా వైపు చూడాల్సి రావచ్చు.. అంతటి అమెరికాను కాదని ఇండియా కల్పించిన సౌకర్యాలు ఏంటి? వ్యాపారవేత్తలు ఇటువైపు రావాల్సిన అవసరం ఏంటి? ఇంతటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ కథనం.అవేమిటో మీరూ చదివేయండి.
పెంటగాన్ ను మించి
సాధారణంగా చాలామంది వ్యాపారవేత్తలకు వాణిజ్యం అంటే పెంటగాన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటరే గుర్తుకు వస్తుంది. వాస్తవానికి ఇంతకుమించి సౌకర్యాలు దుబాయ్, అబు దాబి వంటి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ఆకాశాన్ని తాకేలా వాణిజ్య కేంద్రాలు ఉన్నప్పటికీ.. అవి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను బీట్ చేయలేకపోయాయి. ఇకముందు ఏవీ కూడా బీట్ చేయలేదు అని అనుకుంటున్న తరుణంలో నేనున్నా అంటూ గుజరాత్ రాష్ట్రం పోటీకొచ్చింది. అమెరికాతో తలపడి నెంబర్ వన్ గా ఎదిగేందుకు తహతహలాడుతోంది. ఇంతకీ అమెరికాను కాదని గుజరాత్ చేసింది ఏంటంటే.. అమెరికా దేశంలోని పెంటగాన్ ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రం. ఇక్కడ అనేక రకాలైన వ్యాపార కార్యకలాపాలు సాగుతుంటాయి. కోట్లల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే దీనిని మించేలాగా గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం నిర్మితమైంది. దీనిని నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ భవనాన్ని గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ప్రాంతంలో నిర్మించారు. వజ్రాల ట్రేడింగ్ సెంటర్ ను ఈ భవనంలో నిర్వహిస్తారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలు గుజరాత్ రాష్ట్రం నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రపంచ రత్నాల రాజధానిగా పిలుస్తారు. అయితే కొత్తగా నిర్మించిన ఈ వాణిజ్య కేంద్రాన్ని “సూరత్ డైమండ్ బోర్స్” నిర్మించింది. ఈ భవనంలో వజ్రాలను సానపట్టే కట్టర్లు, పాలిషర్లు వారి కార్యకాలపాలు సాగిస్తుంటారు. సుమారు 65 వేల మంది ఇందులో ఏకకాలంలో పని చేయవచ్చు. దీనిని “వన్ స్టాప్ డెస్టినేషన్ అవుట్లెట్” గా తీర్చిదిద్దారు.
35 ఎకరాల స్థలంలో..
ఈ వాణిజ్య కేంద్రాన్ని 35 ఎకరాల స్థలంలో 15 అంతస్తుల్లో నిర్మించారు.. ఇది 9 టవర్ల సమూహంతో కలిగి ఉంది. ప్రతి టవర్లను ఒకదానితో ఒకటి అనుసంధానించి నిర్మించారు. విశాలమైన సముదాయం కలిగిన ఈ భవనంలో 7.1 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ ఉంది. ఈ భవనాన్ని ఈ ఏడాది నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ భవనాన్ని 4 సంవత్సరాలలో పూర్తి చేశారు. ఈ సముదాయంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీ క్రియేషనల్ జోన్, పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
సెక్షన్_8 కింద రిజిస్ట్రేషన్
ఈ భవనాన్ని కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ _8 కింద రిజిస్టర్ చేయించారు. ఇంత పెద్ద వాణిజ్య సముదాయాన్ని “సూరత్ డైమండ్ బోర్స్” సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేయడం విశేషం. ” ఈ కొత్త భవన సముదాయం చాలామందికి ఉపాధి కల్పిస్తుంది. చాలామంది రోజు ముంబై మహానగరానికి వజ్రాల వ్యాపార నిమిత్తం వెళ్తున్నారు. ఈ సముదాయం కనుక అందుబాటులోకి వస్తే వారు ముంబై వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ భవనంలోనే అత్యాధునిక సదుపాయాల మధ్య వ్యాపారం చేసుకోవచ్చు” అని గుజరాత్ డైమండ్ బోర్స్ సీఈవో మహేష్ గాధవి వివరించారు. ఈ భవనం నిర్మాణం ప్రతిపాదన దశలో ఉన్నప్పుడే చాలా కంపెనీలు తమ తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుగానే నగదు చెల్లించడం విశేషం. ఈ భవనం కనుక అందుబాటులోకి వస్తే రత్నాల వ్యాపారం సూరత్ కేంద్రంగా సాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే 90% వ్యాపారం సూరత్ ప్రాంతంలో జరుగుతోందని, ఇకపై ఆ 10% కూడా కలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వాణిజ్య భవన సముదాయానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. డ్రోన్ విజువల్స్ ద్వారా చిత్రీకరించిన ఆ వీడియోలో భవన సముదాయం ఇంద్ర భవనం లాగా కనిపిస్తోంది.