Sun Pharma : భారతదేశంలో ఆదాయం పరంగా అతిపెద్ద ఔషధ కంపెనీ అయిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ (Sun Pharmaceutical Industries), తన పోర్టుఫోలియోలో కీలక మార్పులను ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుండి కిర్తి గానోర్కర్ కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఎండిగా ఉన్న దిలీప్ సాంఘ్వి, బోర్డుకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు.
ఎండిగా కిర్తి గానోర్కర్: ఎవరు ఈయన?
కిర్తి గానోర్కర్ను ఐదేళ్ల కాలానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు సన్ ఫార్మా వెల్లడించింది. ఈ నియామకానికి జూలై 31న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్ హోల్డర్స్ ఆమోదం లభించాల్సి ఉంది. కిర్తి గానోర్కర్ 1996లోనే సన్ ఫార్మాలో చేరారు. 2019 నుంచి ఆయన సన్ ఫార్మా భారతీయ వ్యాపారానికి అధిపతిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో కంపెనీ ఇండియా బిజినెస్ స్థిరంగా వృద్ధి చెందింది. ఇది మార్కెట్ వాటాను మరింత బలోపేతం చేసింది. ప్రస్తుతం సన్ ఫార్మా భారతదేశంలో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీగా ఉంది. దేశీయ మార్కెట్లో 8 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. మార్కెటింగ్, కొత్త ఉత్పత్తుల పరిచయం, వ్యాపార అభివృద్ధి వంటి విభాగాలలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. సన్ ఫార్మా జపాన్‌లో ప్రవేశించడంలో కూడా కీర్తి గానోర్కర్ కీలక పాత్ర పోషించారు. ఒక ప్రధాన ప్రపంచ ఫార్మాస్యూటికల్ సంస్థగా కంపెనీ మారడంలో భాగం కావడం ఒక గొప్ప అవకాశం అని గానోర్కర్ అన్నారు.
దిలీప్ సాంఘ్వి కొత్త బాధ్యతలు
దిలీప్ సాంఘ్వి, సన్ ఫార్మాకు మార్గదర్శకుడిగా చెప్పుకోవచ్చు. ఆయన ఎండి బాధ్యతల నుంచి తప్పుకున్నా, బోర్డుకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. ఇకపై ఆయన కంపెనీ స్పెషాలిటీ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంపై దృష్టి పెడతారు. ఈ పోర్ట్‌ఫోలియో కంపెనీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 20 శాతం వాటాను కలిగి ఉంది. కిర్తి గానోర్కర్కు కొత్త బాధ్యతలు అప్పగించబడుతున్నప్పటికీ, అన్ని వ్యాపార కార్యకలాపాల గురించి ఆయనకు దిలీప్ సాంఘ్వి వివరించనున్నారు.
కిర్తి గానోర్కర్ సన్ ఫార్మాలో వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని దిలీప్ సాంఘ్వి అన్నారు. కంపెనీని తదుపరి వృద్ధి దశకు తీసుకువెళ్లే ఆయన సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన విజయానికి తన శుభాకాంక్షలు అని దిలీప్ సాంఘ్వి పేర్కొన్నారు. సన్ ఫార్మా కేవలం ఎండి మార్పులతోనే ఆగలేదు. ఉత్తర అమెరికా వ్యాపారంలో కూడా నాయకత్వ మార్పులను ప్రకటించింది. నార్తమెరికా బిజినెస్ సన్ ఫార్మా మొత్తం ఆదాయంలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. ఈ విభాగానికి ప్రస్తుత అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభయ్ గాంధీ 30 సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన తర్వాత రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రిచర్డ్ ఆస్క్రాఫ్ట్ ను ఉత్తర అమెరికా వ్యాపారానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు.
దీంతో పాటు దిలీప్ సాంఘ్వి కుమారుడు అలోక్ సాంఘ్వి, ప్రస్తుతం కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆయనకు ఉత్తర అమెరికా వ్యాపారానికి సంబంధించిన అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. సన్ ఫార్మా అత్యంత ముఖ్యమైన ప్రపంచ మార్కెట్లలో ఒకటైన నార్త్ అమెరికా బిజినెస్ మెయింటెనెన్స్ ఎక్స్ పీరియన్స్, భవిష్యత్తులో కంపెనీకి నాయకత్వం వహించడానికి అలోక్‌కు మంచి పునాది అవుతుంది.