Sridhar Vembu Arattai App: ఆ భారతీయ కంపెనీ ఎదుగుదల చూసి గూగుల్ ఆశ్చర్యపోతోంది. మైక్రోసాఫ్ట్ విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది. సేల్స్ ఫోర్స్ చూస్తూ ఉండిపోతుంది. ఇక మెటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ దిగ్గజాలకు చుక్కలు చూపిస్తున్న ఆ భారతీయ కంపెనీ రిలయన్స్ కాదు, టిసిఎస్ అంతకంటే కాదు. ఆ కంపెనీ పేరు జోహో. ఏకంగా మెటాతోనే ఢీకొంటున్న ఈ కంపెనీ వ్యవస్థాపకుడు పేరు శ్రీధర్ వేంబు. ఈయన మానస పుత్రికనే అరట్టై.. దీనిని మన తెలుగులో పిచ్చాపాటి అని అనవచ్చు.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
అరట్టై వ్యవస్థాపకుడి పేరు శ్రీధర్ వేంబు. ఇతడిది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా ఒళిగచ్చేరి అనే కు గ్రామం. ఈ గ్రామానికి పక్కన కావేరి నదికి ఉపనది అయిన కొల్లిడం ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో ఈ గ్రామంలో మూడు పంటలు పండుతుంటాయి. శ్రీధర్ తండ్రి పేరు సాంబమూర్తి. ఈయన మద్రాస్ హైకోర్టులో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేవాడు. జీతం 3,500. వచ్చే జీతం అంతంత మాత్రమే అయినా సరే పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాడు. మొదటినుంచి శ్రీధర్ ఉపకార వేతనాల ద్వారానే చదువుకున్నాడు. నిరాడంబరమైన జీవితాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. పొదుపు చేయడం అతని తల్లి దగ్గరనుంచి అలవడింది.
శ్రీధర్ ఐఐటి మద్రాస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో పీ హెచ్ డీ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాలోని నేషనల్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పని చేయడానికి అవకాశం వచ్చింది. అక్కడి ప్రభుత్వం అతడికి ఒక బంగ్లా కూడా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ఆ ఉద్యోగం తనకి సరిపోదని భావించిన శ్రీధర్ బయటికి వచ్చాడు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ లో నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు. అనంతరం క్వాల్ కామ్ అనే సంస్థలో ఉద్యోగిగా చేరాడు. కొంతకాలానికి అడ్వెంట్ నెట్ అనే కంపెనీని ప్రారంభించాడు. ఈకంపెనీ చిన్న చిన్న సంస్థల ఐటీ అవసరాలు తీర్చేది. ఈ కంపెనీ లక్ష్యం చిన్న కంపెనీలు కాబట్టి మొదట్లో అడ్వెంట్ నెట్ అనే పేరుని స్మాల్ ఆఫీస్ హోమ్ ఆఫీస్ (SOHO) గా మార్చారు. ఆ తర్వాత ఎస్ స్థానంలో జడ్ అక్షరాన్ని చేర్చి జోహో గా మార్చారు.
శ్రీధర్ దంపతులకు సిద్దు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇతడికి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆటిజం అనే వ్యాధి ఉన్నట్టు తేలింది. దీంతో ఆ పిల్లాడిని తీసుకొచ్చి పల్లెటూరు వాతావరణంలో పెంచడం మొదలుపెట్టారు. దీంతో ఆ బాలుడి ఆరోగ్యం కాస్త కుదుటపడింది. అప్పటినుంచి శ్రీధర్ దంపతులు సొంత గ్రామాల్లోనే ఉంటున్నారు. ప్రస్థానం మనం వాడుతున్న సోషల్ మీడియా యాప్స్, మెయిల్స్ మొత్తం అమెరికా కంపెనీలవి. మన డాటా మొత్తం వాటి వద్ద ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే అవి మన దేశానికి ముప్పు తీసుకొని వస్తే ప్రమాదమే. అందువల్లే స్వదేశీ పరిజ్ఞానంతో అచ్చమైన తమిళ పదాన్ని జోడించి అరట్టై గా నామకరణం చేశాడు శ్రీధర్. 8 సంవత్సరాల క్రితం ఇది మొదలైంది. ఇప్పుడు లక్షల డౌన్లోడ్లతో ఏకంగా వాట్సాప్ కే పోటీ ఇస్తోంది. చెన్నైలో ప్రారంభంలో శ్రీధర్ ఆఫీస్ పెట్టినప్పుడు ఒక సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఆ ఆలోచన నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూరి యువతతో సంస్థను నడిపించాలని భావించాడు. దానికి తగ్గట్టుగానే స్పోక్స్ అండ్ హబ్ అనే సంస్థను ఏర్పాటు చేసి.. గ్రామీణ ప్రాంతాలలోనే శాఖలను ఏర్పాటు చేశాడు. తమిళనాడు రాష్ట్రంలోని తెన్ కాశీ ప్రాంతంలోని మత్తలపాలయం గ్రామానికి దగ్గరలో ఉన్న సిల్లై రైపురవు గ్రామంలో ఆఫీసు ప్రారంభించాడు శ్రీధర్. ప్రస్తుతం కుటుంబంలో కలిసి అక్కడే ఉంటున్నాడు. శ్రీధర్ కార్యాలయంలో ఏసీ ఉండదు. చాప మీద పడుకుంటాడు. ఉదయం 4:00కే నిద్ర లేచి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులతో మాట్లాడుతాడు. ఆ తర్వాత సైకిల్ మీద పోలానికి వెళ్తాడు. గ్రామంలో ఉన్న పిల్లలతో కలిసి చెరువులో ఈత కొడతాడు. ఒకవేళ తెన్ కాశీ పట్టణానికి వెళ్లాలంటే.. ఎలక్ట్రిక్ ఆటోలో అది కూడా స్వయంగా నడుపుకుంటూ అక్కడికి చేరుకుంటాడు..