Skoda Epiq battery backup feature: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda)ఇప్పటికే వినియోగదారులను ఆకర్షించేవిధంగా ఎన్నో మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడ తన సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఎపిక్’ (Epiq)అనే మోడల్‌ను తాజాగా (మే 19, 2026) ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఇది కంపెనీ నుంచి రాబోతున్న అత్యంత చిన్న, సరసమైన ధరతో కూడిన ఎలక్ట్రిక్ కారు. సుమారు 4.17 మీటర్ల పొడవుతో ఉండే ఈ కారు, ఆధునిక డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించబడింది. అంతేకాకుండా ఇంట్లో కరెంట్ లేనప్పుడు లేదా క్యాంపింగ్‌కు వెళ్ళినప్పుడు కారు నుండే పవర్ తీసుకోవచ్చు. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
Skoda Epiq కారును సరికొత్త ‘మోడరన్ సాలిడ్’ డిజైన్ ఫిలాసఫీతో రూపొందించబడింది. దీని ముందు భాగంలో ‘టెక్ డెక్ ఫేస్’ (Tech-Deck Face) ఉంటుంది. ఇందులో స్లిమ్ ‘T’ ఆకారపు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కారు చిన్నదైనప్పటికీ స్పేస్ మేనేజ్మెంట్ అద్భుతంగా ఉంటుంది. దీనిలో 475 లీటర్ల బూట్ స్పేస్ ఉండడంతో పాటు ముందు భాగంలో ఛార్జింగ్ కేబుల్స్ కోసం 25 లీటర్ల ఫ్రంక్ (Frunk) కూడా ఇచ్చారు.
ఈ ఎలక్ట్రిక్ SUVలో వేర్వేరు పవర్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 38.5 kWh, 55 kWh (NMC) అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్ (Epiq 55) ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 440 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బేస్ మోడల్ సుమారు 310 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది.ఈ బ్యాటరీలకు 133 kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కేవలం 24 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) వ్యవస్థను కలిగి ఉంటుంది.
ఈ మోడల్ ఇంటరియర్ లో చాలా మినిమలిస్టిక్‌గా మరియు సుస్థిరమైన (Sustainable) మెటీరియల్స్‌తో ఉంటుంది. 13-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.24-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. అలాగే బిడైరెక్షనల్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అంటే కారు బ్యాటరీతో మీ ఇంటి వస్తువులను కూడా నడపవచ్చు. వన్-పెడల్ డ్రైవింగ్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.అలాగే ఇందులో సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS (లేన్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్) వంటి భద్రతా ఫీచర్లు ప్రామాణికంగా లభిస్తాయి.
అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర సుమారు 25,000 యూరోల నుండి ప్రారంభం కావచ్చు. భారత మార్కెట్లోకి ఈ కారు నవంబర్ 2026 నాటికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 21 లక్షల నుంచి రూ. 26 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఇది టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400 రాబోయే హ్యుందాయ్ క్రెటా ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనే ఆలోచన ఉన్నవారికి ఇందులోని V2L (Vehicle-to-Load) ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉండనుంది. అంటే కరెంట్ లేనప్పుడు లేదా క్యాంపింగ్‌కు వెళ్ళినప్పుడు కారు నుండే పవర్ తీసుకోవచ్చు.
