Two-wheeler : మనం ఏదైనా స్కూటీ కొనడానికి షోరూం వెళ్ళినప్పుడు చాలా మంది బేరాలు ఆడుతారు. వాళ్లు ఓ ఫిక్స్ డ్ రేటుకే ఫిక్స్ అయిపోతారు. అసలు షోరూం యజమానికి ఎంత లాభం వస్తుంది? అని కొందరికి డౌట్ వస్తుంది. లక్ష రూపాయల స్కూటీ అమ్మితే వారికి ఎంత లాభం వస్తుందో వివరంగా తెలుసుకుందాం. కొత్త స్కూటర్ కొన్నప్పుడు కంపెనీకి మొత్తం డబ్బు చెల్లిస్తారు. ఆ చెల్లింపులోనే షోరూం వారికి వచ్చే ఆదాయం కూడా కలిసి ఉంటుంది.
ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. షోరూం యజమాని అంటే డీలర్ ఏదైనా వాహన తయారీ సంస్థ నుండి స్కూటీని ఒక నిర్ణీత ధరకు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత, వారు దానిని వినియోగదారునికి ఒక నిర్ణీత ధరకు (Ex-showroom Price) అమ్ముతారు. ఈ ఎక్స్-షోరూం ధరలో కంపెనీ ఇప్పటికే పన్నులు, ఇన్సూరెన్స్, ఇతర రుసుములను కలుపుతుంది. డీలర్‌కు వచ్చే తేడానే వారి లాభం అవుతుంది.
ఉదాహరణకు సాధారణంగా, టూ-వీలర్ షోరూంల మార్జిన్ 3శాతం నుండి 6శాతం మధ్య ఉంటుంది. అంటే, ఒక స్కూటీ ధర రూ.1,00,000 అయితే, డీలర్‌కు దానిపై దాదాపు రూ.3,000 నుండి రూ.6,000 వరకు లాభం వస్తుంది. ఈ మొత్తం ప్రతి కంపెనీ, మోడల్‌ను బట్టి కొద్దిగా మారవచ్చు.
కొన్ని కంపెనీలు ఎక్కువ ఇన్సెంటివ్స్ లేదా టార్గెట్ ఆధారిత బోనస్‌లు కూడా ఇస్తాయి, దీనివల్ల డీలర్ ఆదాయం కొద్దిగా పెరగవచ్చు. కానీ మొత్తంగా చూస్తే, స్కూటీ అమ్మకాలపై వారికి చాలా పెద్ద లాభం ఉండదు. అందుకే చాలా మంది డీలర్లు యాక్సెసరీస్, ఇన్సూరెన్స్ లేదా ఫైనాన్స్ ప్లాన్‌లను అమ్మి ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నిస్తారు.
షోరూం యజమానులు కేవలం స్కూటీలను అమ్మడం ద్వారానే కాకుండా, ఆ తర్వాత చేసే సర్వీసింగ్, పార్ట్స్ అమ్మకాలు, వారంటీ ఎక్స్‌టెన్షన్ వంటి సర్వీసుల ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందుతారు. చాలా సార్లు డీలర్ ద్వారా ఫైనాన్స్ చేయిస్తే కూడా వారికి కమీషన్ లభిస్తుంది.
దీని అర్థం ఏమిటంటే, లక్ష రూపాయల స్కూటీ అమ్మడం ద్వారా షోరూమ్‌కు ప్రత్యక్ష లాభం పెద్దగా ఉండదు, కానీ అదనపు సేవలు, టార్గెట్ ఆధారిత బోనస్‌ల ద్వారా వారి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి, వినియోగదారులు చెల్లించే పెద్ద మొత్తంలో భారీగా లాభం వస్తుందని అనుకోవడం పొరపాటు.