https://oktelugu.com/

Anil Ambani: ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానం… ఇప్పుడు సెబీ నిషేధం.. అనిల్ అంబానీ ఎందుకు ఇలా పతనమయ్యాడు?

అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ స్థానంలో ఉన్న అనిల్ అంబానీ.. ఇష్టానుసారంగా వ్యవహరించారు. అక్రమాలకు, తెర వెనుక లావాదేవులకు పాల్పడ్డారు. తన గ్రూపు సంస్థల్లో నిధులను పనికిమాలిన కంపెనీలకు 14, 577.68 కోట్లను మళ్లించారు. దీంతో సెబీ ఎదుట ఆయన దోషిగా నిలబడ్డారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 24, 2024 / 12:01 PM IST

    Anil Ambani

    Follow us on

    Anil Ambani: ధీరుబాయ్ అంబానికి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కుమారులు. ధీరుబాయ్ అంబానీ కన్నుమూసిన తర్వాత ఆస్తుల పంపకం విషయంలో గొడవలు తలెత్తాయి. ఒకానొక దశలో ముఖేష్ అంబానీతో అనిల్ అంబానీ తీవ్రంగా కూడా పడ్డారు. అప్పట్లో కొంతమంది పెద్దలు మధ్యవర్తిత్వం నడపడంతో 2005లో ఇద్దరి మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. అప్పట్లో టెలికాం, ఇంధనం, ఫైనాన్స్ రంగాలను అనిల్ అంబానీ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పెట్రో కెమికల్స్ వ్యాపారంతోనే ముఖేష్ అంబానీ సరిపెట్టుకున్నారు.. ఆస్తుల పంపకం అనంతరం అనిల్ అంబానీ దూకుడుగా వ్యవహరించారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు.. ప్రణాళికల అమల్లో మాత్రం ఆశించినంత స్థాయిలో దూకుడు కొనసాగించకపోవడంతో ఆయన గ్రూపులోని అన్ని కంపెనీలు నష్టాల బాట పట్టాయి. 2008లో దాదాపు 4,200 కోట్ల డాలర్ల ఆస్తులతో అనిల్ అంబానీ ప్రపంచ ధనవంతుల్లో ఆరవ స్థానంలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన మరుగున పడిపోయారు. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ టెలికాం, ఫైనాన్స్, రిటైల్ విభాగాలలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.. ఏకంగా ప్రపంచ కుబేరుల్లోనే ఒకరిగా ముకేశ్ అంబానీ ఎదిగారు. దాదాపు భారతదేశంలో అతిపెద్ద శ్రీమంతుడిగా అవతరించారు. ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద ధనవంతుడిగా ఆవిర్భవించారు.

    ముఖేష్ అంబానీ కాపాడినప్పటికీ..

    అప్పట్లో రిలయన్స్ కమ్యూనికేషన్ కోసం ఎరిక్సన్ ఏబీ నుంచి అనిల్ అంబానీ అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిసి అది 550 కోట్ల దాకా అయింది. దీంతో అప్పు చెల్లించాలని ఏ బి ఎరిక్సన్ కంపెనీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లిస్తారా? లేకుంటే జైలు ఊచలు లెక్కబెడతారా అంటూ సుప్రీంకోర్టు అనిల్ అంబానికి హెచ్చరికలు జారీ చేసింది. అప్పుడు ఆయన పరిస్థితి చూసి చలించిపోయిన ముకేశ్ అంబానీ వెంటనే.. అప్పును తీర్చేశాడు. తన తమ్ముడిని జైలుకు వెళ్లకుండా కాపాడాడు. అయినప్పటికీ కంపెనీల ఆర్థిక వ్యవస్థ పెద్దగా మెరుగుపడలేదు. ఆర్థిక క్రమశిక్షణ కొరవడటం.. కంపెనీలు మొత్తం తీవ్రమైన నష్టాల్లో ఉండడంతో అనిల్ అంబానీ క్రమేపి దివాళా వ్యాపారిగా దిగజారిపోయాడు.

    పీకల్లోతు కష్టాల్లో..

    రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ హోం ఫైనాన్స్, రిలయన్స్ క్యాపిటల్స్ కంపెనీలు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోవడంతో అనిల్ అంబానీ నిండా మునిగిపోయారు. 24 వేల కోట్ల విలువైన రుణాలు చెల్లించకపోవడంతో 2021లో అనిల్ అంబానీ చెందిన కంపెనీలు దివాలా తీశాయి. ముంబైలోని తొలి మెట్రో రైల్ లైన్ నిర్మించిన ఘనత రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఉంది. అయితే ఆ కంపెనీ తీసుకున్న రుణాలు చెల్లించలేక తీవ్రమైన ఇబ్బంది పడుతోంది.. ఈ పరిస్థితి ఇలా ఉంటే గతంలో అనిల్ అంబానీ తన నిర్వహణలో ఉన్న కంపెనీల నిధులను పనికిమాలిన కంపెనీలకు రుణాలుగా 14,577.6 8 కోట్లను ఇచ్చారు. ఈ నిధులు దారిమల్లాయని సెబి దర్యాప్తులో తేలింది. అయితే 47 దుల్ల కంపెనీలకు 12,487.56 కోట్లను మళ్లించారని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫోరెన్సిక్ ఆడిట్లో వెళ్లడైంది. ఈ వ్యవహారంలో అనిల్ అంబానికి 24 సంస్థలు సహకారం అందించాయి. అనిల్ అంబానీ తో పాటు, సంస్థలపై కూడా సెబి నిషేధం విధించింది. ఐదేళ్లపాటు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. అంతేకాదు 625 కోట్ల జరిమానా కూడా విధించింది. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ పై ఆరు నెలల పాటు నిషేధంతో పాటు ఆరు లక్షల జరిమానా కూడా విధించింది.. ఈ వ్యవహారంలో అనిల్ అంబానికి అమిత్ బప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షా అనే వ్యక్తులు సహకరించినట్టు సెబీ విచారణలో తేలింది.