Rajamouli And Mahesh: ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి స్థాయి మరింత పెరిగింది. గ్లోబల్ సినిమా వేదికలపై ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటింది. అనేక అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకుంది. అన్నింటికీ మించి ఆస్కార్ కొల్లగొట్టింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసిన జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ వంటి దిగ్గజ దర్శకులు రాజమౌళిని కొనియాడారు.
గ్లోబల్ ఫేమ్ రాబట్టిన రాజమౌళి తన తదుపరి చిత్రం అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. యూనివర్సల్ సబ్జెక్టుని ఎంచుకున్నారు. హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తగ్గని హ్యాండ్సమ్ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జోనర్ ఇప్పటికే రివీల్ చేశారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా అని వెల్లడించారు.
రాజమౌళి సైతం హింట్ ఇచ్చాడు. హాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ ఇండియా జోన్స్ తరహా లో ఈ చిత్రం ఉంటుందని ఆయన అన్నారు. మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తాడట. ఈ చిత్రం కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్నాడు. ఆయన లాంగ్ హెయిర్, గడ్డంలో కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ మహేష్ బాబు గడ్డం పెద్దగా పెంచింది లేదు. హీరోలను సరికొత్తగా చూపించడంలో రాజమౌళి దిట్ట. అందుకోసం తన హీరోలను రాజమౌళి బాగా కష్టపెడతారు.
ఈ చిత్రానికి ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో బంగారు గరుడ రెక్కలను పోస్ట్ చేశాడు. సదరు పోస్ట్ కి SSMB 29 అనే హ్యాష్ ట్యాగ్ జోడించాడు. దాంతో మహేష్-రాజమౌళి చిత్రానికి గరుడ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం మొదలైంది. విజయన్ సోషల్ మీడియా పోస్ట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
గతంలో రాజమౌళి గరుడ అనే ప్రాజెక్ట్ ని ఉద్దేశించి మాట్లాడారు. అప్పుడు ఆయన మాట్లాడిన గరుడ ప్రాజెక్ట్ ని మహేష్ బాబుతో చేస్తున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. మొత్తంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ తో ఎస్ఎస్ఎంబీ 29పై ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. కాగా మహేష్ బాబు జన్మదినం పురస్కరించుకొని ఆగస్టు 9న ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది.
అలాగే ఎస్ఎస్ఎంబి 29పై ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదు. రాజమౌళి, మహేష్ బాబు ప్రెస్ మీట్ పెడతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చింది లేదు.