Samsung new foldable phones : ఇప్పటి దాకా మార్కెట్లో తామే తోపులమని ఫీలవుతున్న ఆపిల్‌కు షాకిస్తూ, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇటీవల కొత్త ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్స్ గతంలో వచ్చిన వాటి కంటే మరింత సన్నగా, తేలికగా ఉన్నాయి. చైనా నుంచి వస్తున్న పోటీని తట్టుకుని, ఇంకా ఆపిల్ ఎంట్రీ ఇవ్వని ప్రీమియం ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో తమ పట్టు నిలుపుకోవాలని శామ్‌సంగ్ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ కొత్త ఫోన్‌లు మార్కెట్‌లో శామ్‌సంగ్‌కు ఒక పెద్ద పరీక్ష కాబోతున్నాయి. 2023లో ఆపిల్ చేతిలో తమ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ కిరీటాన్ని కోల్పోయిన శామ్‌సంగ్, ఇప్పుడు హువావే, ఆనర్ వంటి చైనా కంపెనీల నుండి కూడా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అంతేకాకుండా, శామ్‌సంగ్ చిప్ వ్యాపారం నుంచి లాభాలు పడిపోవడంతో ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌లను సరఫరా చేయడంలో ఆలస్యం జరుగుతోంది.
Also Read: ఈ ఏడాదిలోనే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’..సెన్సేషనల్ డేట్ ని లాక్ చేసిన మేకర్స్!
శామ్‌సంగ్ మొబైల్ ప్రెసిడెంట్ చోయ్ వోన్-జూన్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లలో శామ్‌సంగ్‌ను అగ్రగామిగా నిలపడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆపిల్ మాదిరిగా కాకుండా, శామ్‌సంగ్ గూగుల్ వంటి ఇతర కంపెనీలతో కలిసి పనిచేస్తూ ఏఐలో ముందుండాలని చూస్తోంది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో, శామ్‌సంగ్ గూగుల్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ జెమినితో కూడిన తమ మొదటి స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేసింది. ఇది ఎక్కడ రన్నింగ్ చేయాలి వంటి విషయాలపై సలహాలు ఇవ్వగలదు. అమెరికా విధించే కొత్త పన్నులు డిమాండ్‌ను తగ్గించి, విడిభాగాల ధరలను పెంచే అవకాశం ఉన్నప్పటికీ, శామ్‌సంగ్ ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయడంలో ముందుకు వెళుతోంది.
కొత్త ఫోల్డబుల్ మోడల్స్
శామ్‌సంగ్ కొత్త గెలాక్సీ Z ఫోల్డ్ 7 అమెరికా ధరను 1,999డాలర్ల(రూ.1.70లక్షలు)కి పెంచింది. ఇది గత మోడల్ ఫోల్డ్ 6 కంటే 5శాతం ఎక్కువ. అయితే, గెలాక్సీ Z ఫ్లిప్ 7 లామ్‌షెల్ ఫోన్‌లో తక్కువ ధర గల వెర్షన్ అయిన ఫ్లిప్ 7 ఎఫ్‌ఈని 899డాలర్ల(రూ.77వేలు)కు పరిచయం చేసింది. గెలాక్సీ Z ఫోల్డ్ 7 క్వాల్‌కామ్ ఫాస్టెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ తో వస్తుంది. గెలాక్సీ Z ఫ్లిప్ 7 మాత్రం శామ్‌సంగ్ స్వంత ఎక్సినోస్ చిప్‌లతో పనిచేస్తుంది. విశ్లేషకులు శామ్‌సంగ్ కొత్త మోడల్‌లు ఫోల్డబుల్ ఫోన్‌లలో ఉన్న బరువు, మందం వంటి సమస్యలను పరిష్కరించాయని, దీనివల్ల బ్రాండ్‌కు మంచి ఇమేజ్ వస్తుందని అంటున్నారు. గెలాక్సీ Z ఫోల్డ్ 7 గత మోడల్ కంటే 10శాతం తక్కువ బరువు, 26శాతం సన్నగా ఉంది.
Also Read: లార్డ్స్ టెస్ట్.. హీట్ మొదలైంది.. ఈ వీడియో చూడండి
అధిక ధరలు , ఫోల్డబుల్ ఫోన్‌ల వాడకాలు ఇంకా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల, ఇవి ఇప్పటికీ ఒక చిన్న సెగ్మెంట్‌గానే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక రీసెర్చ్ ప్రకారం మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌లు కేవలం 1.5% మాత్రమే ఉన్నాయి. శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ షిప్‌మెంట్లు 2022లో గరిష్ట స్థాయికి చేరినా, 2025లో అవి స్థిరంగా లేదా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. శామ్‌సంగ్ మొత్తం ఫోన్ అమ్మకాల్లో ఫోల్డబుల్ ఫోన్‌లు 4శాతం వాటాను కలిగి ఉన్నప్పటికీ, 800(రూ.70వేల)డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్‌లలో వాటి వాటా 16శాతంగా ఉంది.
చైనాలో ఆనర్, హువావే ఫోల్డబుల్ ఫోన్‌లు మంచి అమ్మకాలను సాధిస్తున్నందున, శామ్‌సంగ్ ఆధిపత్యం తగ్గుతోందని కెనాలిస్ నివేదిక చూపుతోంది. శామ్‌సంగ్ తన ఫోల్డబుల్ ఫోన్ అమ్మకాల కోసం ప్రధానంగా అమెరికా, యూరప్, దక్షిణ కొరియాపై దృష్టి సారిస్తుందని చోయ్ తెలిపారు.