Sahkar Taxi
Sahkar Taxi Service: కేంద్ర ప్రభుత్వం గురువారం, మార్చి 27 సరికొత్త కోఆపరేటివ్ ట్యాక్సీ సర్వీస్ ‘సహకార ట్యాక్సీ’ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీని ముఖ్య ఉద్దేశం బైక్, క్యాబ్, ఆటో సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం. ఈ కోఆపరేటివ్ ట్యాక్సీ సర్వీస్ ప్రారంభంతో ఓలా, ఊబర్, రాపిడో వంటి ఆన్‌లైన్ ట్యాక్సీ మార్కెట్‌లోని కంపెనీలకు గట్టి పోటీ ఎదురుకాబోతుంది. ఈ పథకాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సర్వీసు ద్వారా వచ్చే లాభం పెద్ద పారిశ్రామికవేత్తలకు కాకుండా వాహన డ్రైవర్లకు అందుతుంది’ అని తెలిపారు.
Also Read : హీరో నుంచి మరో రెండు కొత్త బైక్స్..ఫీచర్స్ వింటే పిచ్చెక్కాల్సిందే
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ముఖ్య ఉద్దేశం ఒక ప్రత్యామ్నాయ ట్రావెల్ సర్వీసును అందుబాటులోకి తీసుకురావడం. దీని ద్వారా డ్రైవర్లు పెద్ద కంపెనీలకు లాభం చేకూర్చకుండా స్వతంత్రంగా సంపాదించుకోగలుగుతారు. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో ఈ విషయం గురించి ప్రకటిస్తూ, ‘సహకార ట్యాక్సీ దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన టాక్సీలు, ఆటో-రిక్షాలు, నాలుగు చక్రాల టాక్సీలను రిజిస్టర్ చేస్తుంది’ అని అన్నారు.
అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సహకార్ సే సమృద్ధి’ కేవలం నినాదం మాత్రమే కాదని, దానిని నిజం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ గత మూడున్నర సంవత్సరాలుగా రాత్రింభవళ్లు కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే నెలల్లో సహకార ట్యాక్సీ సర్వీసు ప్రారంభించబడుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రైవేట్ కంపెనీల వలె కాకుండా, ఈ ప్రభుత్వ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం డ్రైవర్లకే అందుతుందని, తద్వారా వారికి ఎక్కువ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.
దీంతో పాటు దేశంలోని ప్రజలకు బీమా సేవలను అందించడానికి ఒక సహకార బీమా కంపెనీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఇది తక్కువ సమయంలోనే ప్రైవేట్ రంగంలోని అతిపెద్ద బీమా కంపెనీగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో ‘యాత్రి సాథీ’ పేరుతో ఇలాంటి ఒక సర్వీసు ఇప్పటికే కొనసాగుతోంది. ఇది మొదట్లో కేవలం కోల్‌కతాలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు సిలిగురి, అసన్‌సోల్, దుర్గాపూర్ వంటి నగరాలకు కూడా విస్తరించింది. యాత్రి సాథీ త్వరిత బుకింగ్, స్థానిక భాషలో సమాచారం, సరసమైన ఛార్జీలు , 24 గంటల కస్టమర్ సపోర్ట్‌ను అందిస్తోంది. దీని కారణంగా ఇది ప్రయాణికులలో ఒక ప్రసిద్ధ ఎంపికగా మారింది.
2022లో ప్రభుత్వ ఆన్‌లైన్ ట్యాక్సీ సేవ ‘కేరళ సవారి’ని ప్రారంభించిన కేరళ దేశంలోనే మొదటి రాష్ట్రం. అయితే తక్కువ వినియోగం కారణంగా అది మూతపడింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీలు, మెరుగైన సాఫ్ట్‌వేర్‌తో దానిని తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది.
Also Read : రాయల్ గా ఎంట్రీ ఇచ్చిన క్లాసిక్ 650..వావ్.. అదిరిపోయే ఫీచర్స్