కరోనా వల్ల ప్రజలకు మళ్లీ ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు మినీ లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు చేయడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు, చిరు వ్యాపారులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఆదాయం తగ్గుతుంటే మరోవైపు ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతుండటం గమనార్హం.
కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రుణ గ్రహీతలకు ఊరట కలిగే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత రుణాలు, స్మాల్ బిజినెస్ రుణాలు తీసుకునే వాళ్లకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది. గతంలో రీస్ట్రక్చరింగ్ ప్రయోజనాలను పొందని వాళ్లు రీస్ట్రక్చరింగ్ 2.0 ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి.
ఎవరైతే 25 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తానికి రుణాలు తీసుకొని ఉంటారో వారికి రీస్ట్రక్చరింగ్ 2.0 అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫెసిలిటీని అందరూ పొందలేరు. 2021 సంవత్సరం మార్చి నెల 31 నాటికి స్టాండర్డ్ రుణాలుగా ఉన్న రుణాలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోపు ఎప్పుడైనా రీస్ట్రక్చరింగ్ బెనిఫిట్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉంటాయి.
ఆర్‌బీఐ కేవైసీ నిబంధనలను సవరించడంతో పాటు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రీస్ట్రక్చరింగ్ 2.0 కింద మారటోరియంను 2 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం.