Japan Stock Market : జపాన్ స్టాక్ మార్కెట్ లో నిన్నటి రోజును బ్లాక్ మండేగా అభివర్ణిస్తున్నారు. తీవ్ర నష్టాలను స్టాక్ మార్కెట్ చవి చూసింది. నిన్నటి మార్కెట్లో మధుపరులు తీవ్రంగా నష్టపోయారు. కోట్లాది రూపాయల సంపద గాలిలో కలిసింది. అమెరికాలో మాంద్యం ప్రభావం ఈ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఇక పశ్చిమాసియాలో యుద్ధ భయం కారణంగా వాల్ స్ర్టీట్ వణికిపోయింది. మొత్తంగా సోమవారం అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం కనిపించింది. నిన్నటి రోజంతా నష్టాల బాట పట్టిన నిక్కీ ఇక మంగళవారం మార్కెట్ ప్రారంభమైన గంటకు కొంత పెరుగుదల వైపు సాగింది. షేర్ ధర పెరగడంతో మదుపర్లకు కొంత ఊరట కలిగింది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర పతనం అంచునకు చేరుకున్నాయి. జపాన్ మార్కెట్ మరింత ఘోరమైన నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ వద్ద 12.4 శాతానికి పడిపోయింది. అయితే మంగళవారం ఉదయాన్నే 10.7 శాతం పెరుగుదల కనిపించింది. మార్కెట్లు తెరుచుకోగానే ఇండెక్స్ లో పెరుగుదల కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన గంటకు 3,360.39 పెరుగుదల కనిపించి 34,515.81కి చేరుకుంది. వాల్ స్ట్రీట్‌లో తీవ్ర నష్టాల తర్వాత నాటకీయంగా లాభాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నిక్కీ ఏడాది క్రితం స్థాయికి చేరువైంది. నిక్కీ అతిపెద్ద లాభ శాతం 14.2 శాతంగా గత అక్టోబర్ లో నమోదైంది. అయితే బ్లాక్ మండే కారణంగా నిక్కీ పతనం జపాన్ మార్కెట్ ను కుదిపేసింది. నిక్కీ 225 షేరు సూచీ 12.4 శాతం క్షీణతను చవి చూసింది. సోమవారం 4,451 పాయింట్లు కోల్పోయి 31458కు పడిపోయింది. ఈ స్థాయిలో పడిపోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. బ్యాంక్ ఆఫ్ జపాన్ నిర్ణయం, అమెరికాలో మాంద్యం, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ భయాలు జపాన్ స్టాక్ మార్కెట్ ను కుదిపేశాయి.
బ్లాక్ మండేతో ఒక్క రోజులోనే
1987, అక్టోబర్ లో జపాన్ స్టాక్ మార్కెట్ సూచీ నిక్కీ ఒక్క రోజులోనే తీవ్రంగా పతనమైంది. అందుకే దీన్ని ‘బ్లాక్ మండే’గా అభివర్ణించారు. గతంలో 14.9 శాతం పతనమైంది. ఇక ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న సమయంలో నిక్కీ క్షీణత 11.4 శాతంగా నమోదైంది. ఇక 2011లో ఈశాన్య జపాన్ లో వచ్చిన భూకంపాల నేపథ్యంలో 10.6 శాతానికి పడిపోయింది. అయితే తాజాగా బ్యాంక్ ఆఫ్ జపాన్ బెంచ్ మార్క్ వడ్డీ రేటును పెంచిన కారణంగా టోక్యోలో షేర్ల ధరలు పడిపోతున్నాయి.
భారత్ లోనూ అదే పరిస్థితి
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం ట్రేడింగ్ సెషన్ లో తీవ్ర క్షీణత దిశగా సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ కూడా అదే తీరును ప్రదర్శించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితులు భారత్ మార్కెట్ పైనా కనిపించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం కారణంగా ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి.
జులైలో ఉద్యోగాలు తగ్గడం, నిరుద్యోగ రేటు 4.3 శాతానికి పడిపోవడం కారణంగా ఈ సంక్షోభం నెలకొంది. రానున్న ఏడాదిలో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు 25 శాతానికి పైగా ఉన్నట్లు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కూడా స్టాక్ మార్కెట్ ల పతనానికి కారణంగా కనిపిస్తున్నది. అయితే రానున్న వారం రోజుల కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తున్నది.