Gold Prices Increase: సరిగ్గా గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం ధర 80 వేల మధ్యలో ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా లక్ష ఇరవై వేలను దాటిపోయింది. కేవలం మనదేశంలో ఇలానే ఉందా? అంతర్జాతీయంగా కూడా ఇలానే ఉందా? అనే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బంగారం ధర ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. చివరికి బంగారం విక్రయించే వర్తకులు కూడా ధర ఈ స్థాయిలో ఉంటుందని అంచనా వేయలేదు. వాస్తవానికి బంగారం ధర అస్థిరంగా ఉంటూ, రోజుకో తీరుగా రికార్డులను సృష్టిస్తోంది. కొనేవారికి కన్నీళ్లను.. అమ్మేవారికి లాభాలను అందిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డులను తిరగరాస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ఏకంగా 4250 డాలర్లు పలికింది. ఇవాళ అది ఏకంగా 4300 డాలర్లకు చేరుకుంది. డిమాండ్ ఇదేవిధంగా ఉంటే ఐదువేల డాలర్ల మార్కును చేరుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ నిబంధనలు చెబుతున్నారు. మార్కెట్ క్యాప్ విలువ 30 ట్రిలియన్ డాలర్లను క్రాస్ కూడా అయింది. వాస్తవానికి బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతూ ఉండడం.. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులు.. బంగారాన్ని స్థిరమైన వనరుగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. అందువల్లే బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. బంగారం ధరలు అందువల్లే పెరుగుతున్నాయని వర్తకులు అంటున్నారు.
మన దేశంలో వేడుకలకు కచ్చితంగా బంగారం ఉండాలి. అందువల్లే మనదేశంలో బంగారం వినియోగం అధికంగా ఉంటుంది. మనదేశ అవసరాలకు తగ్గట్టుగా బంగారం తయారు కాదు. అందువల్లే ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకున్న దేశాలలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,20,000 పైకి చేరుకున్నప్పటికీ కొనుగోళ్ళు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా గతంతో పోల్చి చూస్తే విక్రయాలు పెరిగాయని వర్తకులు అంటున్నారు. వివాహాలు, ఇతర వేడుకలకు బంగారం అనేది ఖచ్చితమైన అవసరంగా మారిపోయింది. అందువల్లే బంగారం వినియోగం ఈ స్థాయిలో ఉందని వర్తకులు అంటున్నారు. మనదేశంలో బంగారాన్ని కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇతర దేశాలలో అయితే ఖరీదైన ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఒకవేళ మనదేశంలో కూడా ఖరీదైన ఉత్పత్తుల తయారీలో బంగారాన్ని వినియోగించే తీరు గనుక ఉండి ఉంటే ధర మరింత పెరుగుతుందని వర్తకులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా పరిస్థితిలో ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.. అమెరికా ఏమాత్రం తగ్గకపోవడం.. చైనా కూడా సై అంటుండడం.. యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తూ ఉండడం.. రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో అంతర్జాతీయంగా పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. అందువల్లే పెట్టుబడిదారులు బంగారాన్ని అత్యంత సురక్షితమైన కమోడిటీగా భావిస్తున్నారు. అందువల్లే బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా పరిస్థితులు తగ్గుముఖం పడితేనే బంగారం ధరలు నేల చూపులు చూస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.