Egg Prices :  గుడ్లు తేలేసే ధరలు.. ఇలాగైతే కోడిగుడ్లు ఎలా కొనేది?

ఇక 100 యూనిట్ల గుడ్ల ధర ఏప్రిల్ నెల ప్రారంభంలో 390 రూపాయలు ఉండేది. ఆ తర్వాత అది 400 చేరుకుంది. కొద్దిరోజులకు 410 కి పెరిగింది. ప్రస్తుతం 445 కి చేరిన నేపథ్యంలో.. వచ్చే రోజుల్లో అది మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : May 6, 2024 9:51 am

Egg Prices

Follow us on

Egg Prices : ప్రోటీన్లు, పలు రకాల విటమిన్లు పొందేందుకు నేటికీ చాలామంది గుడ్డుకే ఓటు వేస్తారు. ధరలు భరించే స్థాయిలో ఉండడంతో.. చాలామంది గుడ్లను తమ దైనందిన జీవితంలో ఒక ఆహారంగా చేర్చుకున్నారు.. పైగా పౌల్ట్రీ ఫామ్ లు కూడా పెరగడంతో గుడ్లు కూడా విరివిగా లభించడం మొదలైంది. డాక్టర్లు కూడా సిఫారసు చేయడంతో చాలామంది గుడ్లను ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. కొందరు బ్రేక్ ఫాస్ట్ గా, ఇంకొందరు ఆహారంలో భాగంగా గుడ్లను లాగించేస్తున్నారు. మన వంటింట్లో ప్రధాన మెనూలో ఒక భాగమైన గుడ్డు ఇప్పుడు దూరమయ్యే పరిస్థితులు దాపురించాయి. ఎందుకంటే..

పెరిగిన ఉష్ణోగ్రత, కోళ్ల మరణాలు ఎక్కువగా ఉండటంతో గుడ్ల ఉత్పత్తి పడిపోయింది.. వినియోగానికి, సరఫరాకు అంతరం తారా స్థాయికి చేరింది. దీంతో గుడ్ల ధర పెరిగిపోయింది. గత ఏడాది మే నెలలో 100 యూనిట్ల కోడిగుడ్ల ధర 420 రూపాయలుగా ఉండేది. ఇప్పుడిది 445 రూపాయలకు చేరుకుంది. వచ్చే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.. డిమాండ్ కు అనుగుణంగా గుడ్ల ఉత్పత్తి జరగకపోవడంతో ధర అమాంతం పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. వాస్తవానికి ఈ సీజన్లో ఇలాంటి ధరలు తాము గతంలో ఎప్పుడూ చూడలేదని వారు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.. వాస్తవానికి ఏప్రిల్ నెల నుంచి కోడిగుడ్ల ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఇది ఊహించిందే అయినా.. మే నెల ప్రారంభంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం మాత్రం ఇదే తొలిసారి. ఏప్రిల్ 5 నుంచి మే 4 మధ్య ఒక గుడ్డు ధర తక్కువలో తక్కువ 70 నుంచి 80 పైసల వరకు పెరిగింది. హైదరాబాదులో 100 గుడ్ల ధర 445 పలుకుతుంటే.. అదే కరీంనగర్, వరంగల్ కు వచ్చేసరికి 510 నుంచి 520 వరకు పలుకుతోంది. హోల్ సేల్ ఇలా ఉంటే.. రిటైల్ మార్కెట్లో 550 నుంచి 580 వరకు 100 యూనిట్ల గుడ్ల ధరలు పెరిగాయి.

హోల్ సేల్ లో ఒక్కో గుడ్డు ధర మే 1న రూ. 4.25 ఉంటే.. మే ఐదుకు అది రూ. 5.25 కి చేరుకుంది..ఇక ఆన్ లైన్ ప్లాట్ ఫారం లలో అయితే ఆరు యూనిట్ల గుడ్ల ధర దాదాపు ₹70 వరకు పలుకుతోంది..” గత కొద్ది రోజులుగా మార్కెట్లో గుడ్ల ధర అమాంతం పెరిగింది. 100 యూనిట్ల ధర 70 నుంచి 80 రూపాయల వరకు చేరుకుంది.. వేసవి వల్ల కోళ్లల్లో మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఉత్పత్తి పడిపోయిందని పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్పత్తి తగ్గిపోయింది కాబట్టి ధర పెంచక తప్పడం లేదని వారు అంటున్నారు. మేం కూడా ధర పెంచి విక్రయిస్తున్నాం. గత ఏడాది కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసాయి కాబట్టి తక్కువ ధరలు ఉన్నాయి. కానీ, ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదు. అందువల్ల ధరలు భరించలేకుండా ఉన్నాయని” హైదరాబాదు నగరానికి చెందిన గుడ్ల వ్యాపారి అబ్దుల్ రావోస్ చెబుతున్నారు.. ఇక 100 యూనిట్ల గుడ్ల ధర ఏప్రిల్ నెల ప్రారంభంలో 390 రూపాయలు ఉండేది. ఆ తర్వాత అది 400 చేరుకుంది. కొద్దిరోజులకు 410 కి పెరిగింది. ప్రస్తుతం 445 కి చేరిన నేపథ్యంలో.. వచ్చే రోజుల్లో అది మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.