Jagan -R NarayanMurthy : దర్శకుడు ఆర్. నారాయణమూర్తి చాలా సందర్భాల్లో ఏపీ సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. మంచి పాలన అందిస్తున్నారని కొనియాడారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచారని మెచ్చుకున్నారు.అయితే నారాయణమూర్తి ఏదో ఆశించి ఇదంతా చేస్తున్నారని చాలామంది అనుమానపడ్డారు.నిజమే ఆయన ఆశించారు కానీ.. తనకోసం మాత్రం కాదు.తన ప్రాంత రైతుల కోసం..రెండు జిల్లాల ప్రజల కోసం జగన్ ను ఒక కోరిక కోరారు. తాండవ రిజర్వాయర్ ను ఆధునీకరించి..కాలువలు విస్తరిస్తే తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో అదనంగా వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని భావించారు.నారాయణమూర్తి విన్నపాన్ని జగన్ మన్నించారు. అప్పటినుంచి జగన్ అంటే ఒక రకమైన గౌరవభావం ఏర్పడింది నారాయణ మూర్తిలో..
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరిస్తుంటారు ఆర్. నారాయణ మూర్తి.సినీ ఇండస్ట్రీలో మంచివాడు అని గుర్తింపు దక్కించుకున్నారు.2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో నారాయణమూర్తి పావులు కదిపారు.నేరుగా సీఎం జగన్ ను కలిసి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు.సాగునీటి ప్రాజెక్టు విషయమై ప్రస్తావించారు. దీనికి సానుకూలంగా స్పందించిన జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటినుంచి నారాయణమూర్తి జగన్ ను ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగడడం ప్రారంభించారు. అయితే ఏ రిజర్వాయర్ కోసం అంతలా పొగిడారో.. ఆ రిజర్వాయర్ పనులకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. కనీసం పనులు ప్రారంభించకుండానే జగన్ తన పాలనను పూర్తి చేసుకున్నారు. దీంతో నారాయణమూర్తి పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.
తాండవ రిజర్వాయర్ ను ఆధునికరించి.. కాలువలను అనుసంధానిస్తే.. రెండు ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా 5600 ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకి వస్తుంది. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. నారాయణమూర్తి విన్నపం మేరకు 2021 మార్చి 19న పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ను ఖరారు చేశారు. కానీ పనులు మాత్రం చేయలేదు. ఆర్ నారాయణ మూర్తి ఆశలు తీరలేదు. కానీ తన మాట గౌరవించిన జగన్ ను మాత్రం గత ఐదేళ్లుగా నారాయణమూర్తి పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఇప్పుడు నారాయణమూర్తి నోరు మెదపడం లేదు.