Praveena : కష్టేఫలి.. అంటే ఎంత కష్టపడితే ఫలితం అంత బాగుంటుందని.. పై సూక్తికి అచ్చ గుద్దినట్టు సరిపోతుంది ఈ యువకుడి జీవితం. ఎక్కడో కర్ణాటకలోని దావణ గెరె పట్టణంలో దేవర హొన్నాలి గ్రామానికి చెందిన అతడు కేవలం 1800 పెట్టుబడితో 100 కోట్ల కంపెనీ సృష్టించాడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ..ఇది ముమ్మాటికి నిజం. పైగా ఆ యువకుడిది పూర్తిగా పేదరిక నేపథ్యం.
హొన్నాలి గ్రామంలో ఒక పేద రైతు కూలి కుటుంబంలో ప్రవీణ జన్మించాడు. ఆ గ్రామంలో ఉన్న పాఠశాలలో ఏడో తరగతి వరకే బోధించేవారు. పైగా ఆ గ్రామానికి సరిగా విద్యుత్ సరఫరా కూడా ఉండేది కాదు. చదువుకోవాలనే కోరికతో ఏడో తరగతి వరకు స్థానికంగా ఉన్న పాఠశాలలో విద్యను అభ్యసించిన ప్రవీణ.. పై తరగతుల కోసం తన గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు రోజూ నడిచి వెళ్లేవాడు. సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేవాడు. అలా కూలి పనులకు వెళితే అతడికి ఆరు రూపాయలు ఇచ్చేవారు. అవి అతని ఖర్చులకు పనికొచ్చేవి. అలా రోజూ పాఠశాలకు నడుచుకుంటూనే వెళ్లి కష్టపడి చదివాడు. పదవ తరగతి ఉన్నతశ్రేణిలో పాస్ అయ్యాడు. వారి ఊరిలో నేరుగా పదో తరగతి పాస్ అయింది ప్రవీణ ఒక్కడే.
10 పాస్ అయిన తర్వాత తదుపరి చదువుల కోసం ప్రవీణ తండ్రి తన మకాంను దావణ గెరె మార్చాడు. అక్కడ ఒక మురికివాడలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవీణ స్థానికంగా ఉన్న ఒక కళాశాలలో చేరి ఇంటర్ చదవడం ప్రారంభించాడు. సాయంత్రం పూట ఒక ఫార్మసీలో పనిచేసేవాడు. నెలకు 600 దాకా సంపాదించేవాడు. అది అతడి పుస్తకాల ఖర్చుకు పనికి వచ్చేది. అలా డిగ్రీ, పీజీ వరకు ప్రవీణ పూర్తి చేశాడు. 2006లో ప్రసిద్ధ ఫుడ్ బ్రాండ్ పార్లే కంపెనీ నుంచి కోకోకోలా, విప్రో, ఓయో లాంటి కంపెనీలలో పనిచేశాడు. అతడు సేల్స్ విభాగంలో పనిచేయడం వల్ల ప్రజలతో సంబంధాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. కోకా కోలా లో పనిచేస్తున్నప్పుడు సత్యజిత్ ప్రసాద్ అనే వ్యక్తితో ప్రవీణకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సత్య జీత్ ఓయోలో చేరాడు. అతడు చేరిన తర్వాత ప్రవీణను కూడా అందులోకి తీసుకెళ్లాడు.
ప్రవీణ మైసూరు లోని ఓయోలో పనిచేస్తున్నప్పుడు దాని వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పనితీరును చూసి ముచ్చటపడేవాడు. కోవిడ్ సమయంలో ప్రవీణ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ సమయంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జీవితం ఆధారంగా నిర్మితమైన గురు అనే సినిమాను చూసి ప్రభావితమయ్యాడు. ఆ తర్వాత తన భార్యను, కుమారుడిని తన తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి.. స్వదేశీ వ్యాపారంపై దృష్టి పెట్టాడు. మైసూర్ లో స్వదేశీ గ్రూప్ పేరుతో పునరుత్పాదక ఇంధన ఆధారిత వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం కోసం ముందుగా అతడు పెట్టిన పెట్టుబడి కేవలం 1800. ఆ 1800తో కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తర్వాత కర్ణాటకలోని టైర్-2, 3 నగరాల్లో సోలార్ వాటర్ హీటర్లు విక్రయించడం మొదలుపెట్టాడు. అలా ఆ కంపెనీ సోలార్ ద్వారా పనిచేసే అన్ని విద్యుత్ పరికరాలను తయారు చేయడం మొదలుపెట్టింది. నాణ్యత, మన్నిక ఉండటంతో వినియోగదారులు స్వదేశీ గ్రూపు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రయాణంలో ప్రవీణకు అతని భార్య చిన్మయ అడుగడుగునా సహకరించింది. ప్రస్తుతం ఆమె స్వదేశీ గ్రూపు వ్యవస్థాపకుల్లో ఒకరు. స్వదేశీ గ్రూప్ నాలుగేళ్లలోనే అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం 100 కోట్ల విలువైన కంపెనీగా ఆవిర్భవించింది.
సోలార్ వాటర్ హీటర్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, వాటర్ ప్యూరిఫైయర్లు, ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్, ఎయిర్ హీట్ పంపులు.. ఇలా సోలార్ పవర్ తో పని చేసే ఉత్పత్తులను స్వదేశీ గ్రూప్ తయారు చేస్తోంది. అంతేకాదు స్వదేశీ గ్రూప్ ఫ్రాంచైజీ వ్యాపారం కూడా నిర్వహిస్తోంది. తక్కువలో ఒక షోరూం ఏర్పాటు చేయడానికి పది లక్షల దాకా ఎస్టిమేషన్ అమౌంట్ గా స్వీకరిస్తున్నది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన కేవలం 18 పెట్టుబడితో 100 కోట్ల కంపెనీని సృష్టించాడు. ఆ కంపెనీని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నాడు. కష్టేఫలి అని దీనినే అంటారు కాబోలు.