Paytm Shares: పేటీఎం బ్యాంకు విలువ రోజురోజుకు పడిపోతుంది. నెల రోజులుగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న ఈ సంస్థ షేర్లు తాజాగా భారీ స్థాయిలో దిగువకు వచ్చాయి. ఏప్రిల్ 9న మంగళవారం ఒక్కరోజే పేటీఎం స్టాక్ బీఎస్ ఈలో 1.95 శాతం పడిపోయి రూ.404.30 వద్ద ముగిసింది. దీంతో గత ఆరు నెలల్లో మొత్తం 59 శాతం క్షీణించింది. ఇదిలా ఉండగా పేటీఎం పేమేంట్స్ బ్యాంక్ ఎండీ సురీందర్ చావ్లా సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. దీంతో పేటీఎం బ్యాంకు పరిస్థితి దయనీయంగా మారిందని తీవ్ర చర్చ సాగుతోంది.
2024లో పేటీఎం మార్కెట్ వాటా 11 శాతంగా ఉంది. మార్చి వరకు 9 శాతానికి పడిపోయింది. నెల రోజుల్లో 2 శాతం క్షీణించిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తెలిపింది. దీని డేటా ప్రకారం 2024 జనవరిలో పేటీఎం బ్యాంకు 1.4 బిలియన్ల లావాదేవీలు నిర్వహించగా.. ఫిబ్రవరిలో 1.3 బిలియన్ల లావాదేవీలు నిర్వహించగా.. మార్చిలో 1.2 బిలియన్లకు చేరింది. పేటీఎం బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించినప్పటి నుంచి దీని షేర్ల విలువ తగ్గుతూ వస్తోంది.
ఆర్థిక లావాదేవీల విషయంలో పేటీఎం నిబంధనలను ఉల్లంఘింంచిదని, ఖాతాదారుల ప్రైవసీని పట్టించుకోలేదన్న ఆరోపణలపై ఆర్బీఐ పేటీఎంపై కొన్ని నెలల కిందట ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మార్చి చివరి తరువాత ఖాతాదారులు పేటీఎం ద్వారా ఎటువంటి సేవలు వినియోగించొద్దని పేర్కొంది. ఆ తరువాత పేటీఎం యాజమాన్యం ఇతర కంపెనీలను సంప్రదింపులు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పేటీఎం విలువ రోజురోజుకు పడిపోతుంది.
ఇదిలా ఉండగా పేటీఎం విలువ పడిపోతున్న సమయంలో గూగుల్ పే, ఫోన్ పే ట్రాన్జాక్షన్ పెరిగాయి. 2024 మార్చి నెలలో గూగుల్ పే ద్వారా 5 బిలియన్ల లావాదేవీలు జరగగా.. ఫోన్ పే ద్వారా 6.5 బిలియన్ల ట్రాన్జాక్షన్ నిర్వహించారు. పేటీఎంలో ఉండే సౌకర్యాల కంటే ఫోన్ పే , గూగుల్ పేలో కొన్ని తక్కువ ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయంగా ఈ రెండు మనీ ట్రాన్జాక్షన్ యాప్ లపై ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది.