Papikondalu Tour Package : తెలుగు రాష్ట్రాల్లో పాపికొండల పర్యాటకుల సందడి మళ్లీ మొదలైంది. వరదల సీజన్ ముగియడంతో ఏపీలోని కాకినాడ పోర్టు అధికారులు టూరిజం సీజన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాపికొండల లాంచీల నిర్వాహకులు దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పాపికొండల విహారయాత్రను అధికారికంగా మళ్లీ ప్రారంభించారు. దీంతో ఏపీలోని ఏఎస్ఆర్ జిల్లా వరరామచంద్రపురం మండలం పోచవరం వద్ద కొద్ది రోజులుగా పర్యాటకుల రద్దీ నెలకొంది. జూలై మాసం నుంచి మొన్నటి వరకు గోదావరి వరదల కారణంగా పాపికొండల పర్యాటన నిలిచిపోయింది. ప్రస్తుతం గోదావరికి వరదలు ముగియడంతో పాపికొండల పర్యాటక యాత్ర మళ్లీ పుంజుకుంది. పాపికొండల యాత్రకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని భద్రాచలం ప్రాంతం నుంచి పాపికొండల యాత్రకు వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో బోటింగ్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇక తెలంగాణ టూరిజం కూడా త్వరలోనే ఈ ట్రిప్ ను అందుబాటులోకి తీసుకుని రావడానికి కసరత్తు ప్రయత్నిస్తోంది. పాపికొండలు టూర్ ప్యాకేజీ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. నాలుగు నెలలుగా ఏపీలో నిలిచిపోయిన పాపికొండలు బోట్ ట్రిప్ రీసెంట్ గా ప్రారంభం అయింది. ఏపీ టూరిజం ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చేశాయి. టూరిస్టులు బుకింగ్ చేసుకుని పాపికొండలు తిలకించేందుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన పాపికొండలు టూర్ అహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. రాజమండ్రి నుంచి మొదలై దేవీపట్నం మీదుగా…పాపికొండల మధ్య గోదావరిలో సాగే ఈ పర్యటన ప్రకృతి ప్రేమికులను మరో లోకంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడికి భద్రాచలం నుంచి కూడా చేరుకోవచ్చు.
పాపికొండలు టూర్ మొదలైన నేపథ్యంలో… తెలంగాణ టూరిజం కూడా ప్యాకేజీని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం నుంచి బోట్ అనుమతులు రాగానే ప్రారంభించేందుకు రెడీ అయింది. బోట్ అనుమతులు రాగానే వచ్చే నవంబర్ నెల నుంచి ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. పాపికొండలను తిలకించేందుకు తెలంగాణ టూరిజం శాఖ “PAPIKONDALU ROAD CUM RIVER CRUISE PACKAGE TOUR ” పేరుతో పర్యాటకుల కోసం స్పెషల్ ప్యాకేజీని తీసుకుని వస్తోంది. తెలంగాణ టూరిజం ప్రకటించిన పాపికొండలు టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. మొత్తం మూడు రోజుల పాటు టూర్ ప్యాకేజీ ఇది. బస్సులో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అనంతరం గోదావరి అలలపై బోటింగ్ ఉంటుంది. తొలుత పోచారం బోటింగ్ పాయింట్ కు చేరుకుని.. పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి చేరుకుంటారు. పొచారానికి బోట్ లో జర్నీ చేయాల్సి ఉంటుంది. జర్నీ సమయంలో లంచ్ తో పాటు స్నాక్స్ కూడా ఇస్తారు. రాత్రి భద్రాచలంలోని హారిత హోటల్ లో ఉంటారు. తర్వాత పర్ణశాలకు కూడా తీసుకెళ్తారు. మొన్నటి వరకు పాపికొండలు వెళ్లేందుకు ఆపరేట్ చేసిన ప్యాకేజీ ధరలను ఓ సారి పరిశీలిస్తే.. పెద్దలకు 6999, పిల్లలకు 5599గా ఉంది . నాన్ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. తాజాగా రాబోయే టూర్ ప్యాకేజీ ధరల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీ అప్డేట్స్ కావాలంటే https://tourism.telangana.gov.in/ను సందర్శించవచ్చు.