OpenAI Employees Salary: గడిచిన నాలుగు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐటి పరిశ్రమలో పని చేసేవారు.. ఉద్యోగాలను కోల్పోతున్నారు. గూగుల్ నుంచి మొదలుపెట్టే అమెజాన్ వరకు అన్ని కంపెనీలలో ఉద్యోగాల కోత నిరంతరం కొనసాగుతోంది. ఐటీ పరిశ్రమను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తున్న నేపథ్యంలో కొత్త ఉద్యోగాలు వస్తున్నప్పటికీ.. పాత ఉద్యోగాలు దారుణంగా కోతకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలలో కంపెనీలు దారుణంగా కోత విధిస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ఆటోమేషన్ వంటి వాటి వల్ల గడిచిన నాలుగు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. కరోనా తర్వాత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కంపెనీలు ఇష్టానుసారంగా చేస్తున్నాయి. లేబర్ చట్టాలను పట్టించుకోకుండా, ఉద్యోగుల మెడ మీద కత్తి పెట్టి బయటికి పంపిస్తున్నాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయి నడిరోడ్డు మీద పడుతున్నారు.
ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నప్పటికీ.. కంపెనీలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వినియోగం విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆటోమేషన్ ను అమలు చేయడంలో మరింత దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో ఉద్యోగాల కోత మరింత దారుణంగా ఉంటుందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2026 లో జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగు చూసింది.
పలు కంపెనీల నివేదికల ప్రకారం టెక్ స్టార్టప్ చరిత్రలో ఓపెన్ ఏఐ సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని తెలిసింది. 2026 ప్రారంభంలోనే ఈ సంస్థ తన ఉద్యోగులకు సగటున 1.5 మిలియన్ డాలర్లు (13.48 కోట్లు) విలువైన స్టాక్ ఆధారిత వేతనాలను చెల్లిస్తోంది. Google వంటి పెద్ద కంపెనీలు కూడా ఐపిఓ కి వెళ్లేముందు భారీగానే జీతాలు ఇచ్చాయి. గూగుల్ కంటే ఓపెన్ ఏఐ ఇచ్చే వేతనాలు ఏడురెట్లు ఎక్కువని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రతిభ ఉన్న ఉద్యోగుల కోసం పోటీ పెరిగింది. దీంతో మెటా వంటి కంపెనీలు ఆస్థాయి ఉద్యోగులను భారీగా వేతనాలు ఇచ్చి తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కాపాడుకోవడానికి ఓపెన్ ఏఐ ఈ స్థాయిలో ప్యాకేజీలు ఇస్తోంది.