India Largest IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీవోకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టెలికాం రంగంలో సేవలందిస్తున్న జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే ఆలోచనలో ముఖేష్ అంబానీ ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలను వెలువరిస్తున్నాయి. మార్కెట్ ఊహించినట్టుగానే జియో ఐపీఓకు వస్తే దేశంలో ఎన్నడూ లేనివిధంగా రూ.55,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు క్రియేట్ చేస్తుంది.
జియో ఇటీవల మొబైల్ చార్జీల రేట్లను పెంచింది. దీంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్+ఐడియా వంటి కంపెనీలు కూడా జియో పంథానే ఎంచుకున్నాయి. అవి కూడా టారిఫ్‌లను పెంచాయి. దీంతో జియో వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా ఐపీఓకు వెళ్తుందన్న వార్తలు రావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐపీఓ రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు జియో 4జీ టారిఫ్‌లతోనే 5జీ సేవలు అందిస్తుండగా, ఇకపై 5జీకి కూడా ప్రత్యేక టారీఫ్ నిర్ణయించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
జూలై మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో ఆగస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్) నిర్వహిస్తోంది. ఇందులో జియో ఐపీఓకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ ఊహిస్తున్నట్లుగానే జియో ఐపీఓ ద్వారా రూ.55వేల కోట్లు సమీకరించుకుంటే దేశంలో అతిపెద్ద ఐపీఓగా నిలువనుంది. ఇప్పటి వరకు రూ.21వేల కోట్లు సమీకరించుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఐపీఓ మాత్రమే అతిపెద్దది. జియో మొత్తం విలువ రూ.11 లక్షల కోట్లుగా అంచనా. జియోలాంటి అతి పెద్ద కంపెనీ ఐపీఓకు వస్తే సుమారు 5 శాతం విక్రయించాలి. కాబట్టి దాని విలువ రూ.55వేల కోట్లుగా లెక్కిస్తున్నారు.
ఇటీవల పెంచిన టారీఫ్‌లతో జియో సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) పెరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది. 5జీకి ప్రత్యేకంగా టారీఫ్‌లు తీసుకువస్తే ఆదాయం మరింత సమకూరుతుంది. దీంతో కంపెనీ రెవెన్యూలో పెరుగుదల ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం గడిచిన నెలలోనే స్టాక్ ధర ఏకంగా 11.4 శాతం పెరిగింది.