Morgan Stanley Report: భారతదేశం ఆర్థికంగా రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతోంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో భారత్ తన ఆర్థిక వృద్ధిని సాధించబోతోందని తాజాగా మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. 2028 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. అప్పటికి మన దేశ జీడీపీ 5.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని, జర్మనీని బీట్ చేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు 2035 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 10.6 ట్రిలియన్ డాలర్లకు రెట్టింపు అవుతుందని అంచనా. ఈ అంచనా భారతదేశం ఎంత వేగంగా ఆర్థికంగా ఎదుగుతోందో, అంతర్జాతీయ మార్కెట్లలో దాని ప్రభావం ఎంతలా పెరుగుతుందో చూపిస్తుంది. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు, పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యతో వచ్చే పదేళ్లలో ప్రపంచ వ్యాపార తీరునే భారత్ మార్చబోతోందని నివేదిక తెలిపింది.
2023లో 3.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ, 2026 నాటికి 4.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచంలో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుంది. 1990లో భారత్ 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 2000లో 13వ స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత 2020లో 9వ స్థానానికి, 2023లో 5వ స్థానానికి ఎగబాకింది.
ప్రపంచ జీడీపీలో భారతదేశ వాటా 2029 నాటికి 3.5 శాతం నుంచి 4.5 శాతానికి పెరుగుతుందని అంచనా. 2030 నుండి 2035 మధ్య భారతదేశంలోని మూడు నుంచి ఐదు రాష్ట్రాలు ఒక్కొక్కటి దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలను సాధిస్తాయని అంచనా వేసింది. ఇవి ప్రపంచంలోని టాప్ 20 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తాయని పేర్కొంది. ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉన్న రాష్ట్రాలుగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలను గుర్తించారు.
Also Read: భారత్‌లో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..
ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి. గత ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అత్యధిక పెరుగుదలను చూపించాయి. భారత ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన మూలధన ఖర్చును 2015 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 1.6 శాతం నుండి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.2 శాతానికి రెట్టింపు చేసింది. ఇది మౌలిక సదుపాయాల వృద్ధికి గణనీయంగా దోహదపడింది. ప్రస్తుతం హైవేలు 60 శాతం పెరిగాయి. ఎయిర్ పోర్టులు డబుల్ అయ్యాయి. మెట్రో నెట్‌వర్క్ నాలుగు రెట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. పీఎం గతి శక్తి, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్, భారత్‌మాల వంటి ప్రధాన మౌలిక సదుపాయాల కార్యక్రమాలను ఈ నివేదికలో పేర్కొన్నారు. మోర్గాన్ స్టాన్లీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం జీడీపీ వృద్ధిని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది.