MG Windsor Pro Review : ఎంజీ మోటార్స్ విండ్‌సర్‌ను విడుదల చేసినప్పటి నుంచి ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా పంచ్ నుంచి టాటా నెక్సాన్ వరకు అనేక కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. ఇప్పుడు వినియోగదారుల రేంజ్ ఆందోళనలను తగ్గించేందుకు కంపెనీ ఎంజీ విండ్‌సర్ ప్రోను విడుదల చేసింది. ఇది ఒక్క ఛార్జ్‌పై 449 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతోంది. అయితే నిజంగా ఈ కారు అంత రేంజ్ ఇస్తుందో లేదో తెలుసుకుందాం.
Also Read : ఆఫర్ పోతే మళ్లీ రాదు.. స్విఫ్ట్ నుండి బ్రెజా వరకు భారీ డిస్కౌంట్లు
కొత్త కారులో వచ్చిన మార్పులు
కొత్త ఎంజీ విండ్‌సర్ ప్రోలో కంపెనీ చేసిన అతిపెద్ద మార్పు బ్యాటరీ ప్యాక్. ఇప్పుడు ఇందులో 52.9 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను ఇచ్చారు. కాస్మెటిక్స్‌లో పెద్దగా మార్పులు లేవు. కార్ వీల్స్‌ను మాత్రం హెక్టర్ అల్లాయ్ వీల్స్ లాగా డిజైన్ చేశారు. ఇక కారులో ఇప్పుడు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ కూడా ఉంది. బ్యాటరీ ప్యాక్ పెరగడం వల్ల కారులో బూట్ స్పేస్ తగ్గింది. ఇది ఎంజీ విండ్‌సర్ ఈవీతో పోలిస్తే 25 లీటర్లు తక్కువగా ఉంది. బ్యాటరీతో ఈ కారు ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు. అయితే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్షన్‌తో దీని ధర రూ. 12.49 లక్షలు. ఈ ధర మొదటి 8000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది విడుదలైన మొదటి 24 గంటల్లోనే ఆ బుకింగ్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ కారు ధర రూ. 60,000 వరకు పెరిగింది.
ఎంత రేంజ్ ఇస్తుంది?
ఎంజీ విండ్‌సర్ ప్రోలో 52.9 కిలోవాట్ అవర్ (kWh) సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. సాధారణ విండ్‌సర్ ఈవీలో 38 kWh బ్యాటరీ ఉంటుంది. దీని వల్ల విండ్‌సర్ ప్రో క్లెయిమ్డ్ రేంజ్ 449 కిలోమీటర్లకు పెరిగింది (MIDC సర్టిఫైడ్). అయితే, రియల్ టైం డ్రైవింగ్ పరిస్థితులు, డ్రైవింగ్ విధానం బట్టి ఈ రేంజ్ 320 కిలోమీటర్ల నుండి 360 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని రివ్యూలు సూచిస్తున్నాయి. కొందరు రివ్యూయర్‌లు కొండ ప్రాంతాల్లో డ్రైవ్ చేసినప్పుడు కూడా మంచి ఎఫిషియెన్సీని కనబరిచిందని తెలిపారు.
డిజైన్, ఫీచర్లు:
డిజైన్ పరంగా, విండ్‌సర్ ప్రో దాదాపు సాధారణ విండ్‌సర్‌లానే ఉంటుంది. అయితే, కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ హెక్టర్ వీల్స్‌ను పోలి ఉన్నాయి. ఈ కారులో ఇప్పుడు పవర్డ్ టెయిల్ గేట్ కూడా ఉంది. లోపలి భాగంలో డ్యూయల్-టోన్ ఐవరీ ఇంటీరియర్ థీమ్‌ను అందించారు, ఇది క్యాబిన్‌ను మరింత విశాలంగా, ప్రీమియంగా చూపిస్తుంది.

ఇతర ఫీచర్లలో 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 9-స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, 256-రంగుల యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు ఉన్నాయి. సేఫ్టీ కోసం లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కూడా ఈ కారులో అందించారు.
డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్
విండ్‌సర్ ప్రో ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది, ఇది 134 bhp పవర్, 200 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ చాలా స్మూత్‌గా, జెర్క్ లేకుండా ఉంటుంది. సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది, హైవేలపై కూడా ఓవర్‌టేకింగ్ సులభంగా చేయవచ్చు. అయితే, కొంచెం వేగంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు బాడీ రోల్ కనిపించవచ్చు. సస్పెన్షన్ కొంచెం స్టిఫ్‌గా ఉండటం వల్ల రోడ్లపై కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు.

ధర
ఎంజీ విండ్‌సర్ ప్రో ప్రారంభ ధర సుమారు రూ. 17.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఎంపికతో కొనుగోలు చేస్తే, ధర రూ. 12.50 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అదనంగా కిలోమీటరుకు కొంత చార్జీ ఉంటుంది.
Also Read : భారీ డిస్కౌంట్.. హ్యుందాయ్ కార్ల మీద ఏకంగా రూ.4లక్షల తగ్గింపు