MG Windsor EV : ఇండియాలో దాదాపు ఆర్నెలల క్రితం ఎంజీ మోటార్ విడుదల చేసిన విండ్‌సర్ ఈవీ (MG Windsor EV) ప్రజలకు బాగా నచ్చింది. ఇది అతి తక్కువ సమయంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఈ కారు అమ్మకాల విషయంలో నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి అనేక పాపులర్ కార్లను సైతం వెనక్కి నెట్టింది. ఇప్పుడు కంపెనీ విండ్‌సర్ ఈవీని మరింత పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్‌తో విడుదల చేయబోతోంది. ఎక్కువ రేంజ్‌తో ఇది త్వరలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను విడుదల చేయనున్న మారుతికి కూడా గట్టి పోటీనిస్తుంది.
Also Read : పొగకు బై బై.. హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ కారు వచ్చేసింది!
విండ్‌సర్ ఈవీ ప్రస్తుత మోడల్ 38 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 331 కిమీ రేంజ్‌ను అందిస్తుందని పేర్కొంది. అయితే, ఇప్పుడు ఎంజీ విండ్‌సర్ ఈవీని పెద్ద 50 kWh బ్యాటరీతో విడుదల చేయబోతోంది. పెద్ద బ్యాటరీతో విండ్‌సర్ ఈవీ దాదాపు 461 కిమీ వరకు రేంజ్ వస్తుంది. రేంజ్ పెరగడంతో కారు ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఎంజీ కొత్త విండ్‌సర్ ఈవీని మే మొదటి వారంలో విడుదల చేయనుంది. అయితే, కంపెనీ ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు.
విండ్‌సర్ ఈవీ డిజైన్
విండ్‌సర్ ఈవీ ఈవీ న్యూ జనరేషన్ ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఎలక్ట్రిక్ కారు. ఇది అనేక బ్యాటరీ సైజ్, బాడీ స్టైల్‌లకు సపోర్టు ఇచ్చే విధంగా రూపొందించారు. కాబట్టి పెద్ద యూనిట్‌ను అమర్చడానికి కారు డిజైన్, పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఎంజీ విండ్‌సర్ ఈవీ 50 kWh వెర్షన్ ఇండోనేషియా వంటి మార్కెట్లలో ఇప్పటికే అమ్ముడుపోతుంది. అక్కడ దీనిని వూలింగ్ క్లౌడ్ ఈవీ పేరుతో విక్రయిస్తున్నారు.
విండ్‌సర్ ఈవీ ఛార్జింగ్ సమయం
పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో విండ్‌సర్ ఈవీ ఛార్జింగ్ సమయం కూడా మెరుగుపడుతుంది. 50.3 kWh వెర్షన్ 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 46 నిమిషాల్లో 0% నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది. గృహ వినియోగ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 12 గంటలు పడుతుంది. అయితే, కంపెనీ ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత 38 kWh మోడల్ ఫాస్ట్ ఛార్జర్‌తో 0-80% కేవలం 55 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. గృహ వినియోగ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 7-8 గంటలు పడుతుంది.
విండ్‌సర్ ఈవీ ధర
ఎంజీ విండ్‌సర్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర బేస్ మోడల్ ఎక్సైట్ కోసం రూ.13,99,800 నుండి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ మోడల్ ఎసెన్స్ కోసం రూ.15,99,800 వరకు ఉంటుంది. రాబోయే 50.3 kWh వెర్షన్ ధర దాదాపు రూ.1-1.5 లక్షలు ఎక్కువగా ఉండవచ్చు. ఎంజీ విండ్‌సర్ ఈవీ కొనుగోలుపై బ్యాటరీ యాజ్ ఏ సబ్‌స్క్రిప్షన్ (BaaS) మోడల్‌ను కూడా అందించవచ్చు, ఇది ప్రస్తుత మోడల్‌లో అందుబాటులో ఉంది.
విండ్‌సర్ ఈవీ విడుదలైనప్పటి నుంచి బాగా ఆదరణ పొందుతోంది. దీనికి కారణం దాని సరికొత్త డిజైన్, లోపల లభించే అద్భుతమైన ఫీచర్లు. ఈ కారు భారతదేశ ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్‌లో ఎంజీ వాటాను బలోపేతం చేసింది. ఎంజీ ఇప్పుడు 21శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అయితే టాటా మోటార్స్ వాటా 73శాతం నుండి 62శాతానికి తగ్గింది. ఇప్పుడు మారుతి కూడా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను త్వరలో విడుదల చేయబోతోంది. ఖచ్చితంగా ఈ విటారా విండ్‌సర్ ఈవీ నుంచి గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.
Also Read : బిగ్ బాస్ 9′ కి హోస్ట్ గా వ్యవహరించడంపై స్పందించిన హీరో నాని!