MG Windsor EV: ప్రస్తుతం భారతదేశంలో ఈవీ యుగం నడుస్తోంది. రోజు రోజు కరెంటుతో నడిచే కార్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. కంపెనీలు కూడా ఆ సెగ్మెంట్లో కార్లను ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వెర్షన్లో తీసుకొస్తూనే ఉన్నాయి. ఎంజీ విండ్‌సర్ ఈవీ ఒక మిడిల్ రేంజ్ ఎలక్ట్రిక్ SUV. దీనిని 2024 చివరిలో విడుదల చేశారు. భారతదేశంలో సరికొత్త డిజైన్‌తో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ కారు తన ఫీచర్లు, రేంజ్‌తో వినియోగదారులను ఆకట్టుకుంది. అంతేకాకుండా దీనితో లభిస్తున్న లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ వినియోగదారులకు ఎటువంటి ఆందోళన లేకుండా చేసింది. దీని ఫలితంగా, ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. కేవలం 6 నెలల్లోనే 20 వేల మందికి పైగా దీనిని కొనుగోలు చేశారు.
Also Read: తక్కువ ధరలో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు.. కియా EV4 మార్కెట్‌ను షేక్ చేస్తుందా?
కంపెనీ విండ్‌సర్ ఈవీ కొనుగోలు చేసే వారికి లైఫ్ టైం బ్యాటరీ వారంటీని అందిస్తోంది. అంటే, కారు ఉన్నంత కాలం బ్యాటరీ పాడైతే ఉచితంగా కంపెనీ బాగు చేయించి ఇస్తోంది. అయితే, ఈ వారంటీ కేవలం కారు మొదటి యజమానికి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ కారును వేరే వారికి విక్రయిస్తే, రెండవ యజమానికి 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. అయితే, కారు కోసం వారంటీ మాత్రం 3 సంవత్సరాలు మాత్రమే ఇస్తున్నారు.
విండ్‌సర్ ఈవీ రేంజ్
ఎంజీ విండ్‌సర్ ఈవీ ధర ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి ఢిల్లీలో ఆన్-రోడ్ రూ.15.01 లక్షల నుండి రూ.17.09 లక్షల మధ్య ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే 3 వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. విండ్‌సర్ ఈవీ 38kWh బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. దీని రేంజ్ 331 కిమీ అని కంపెనీ చెబుతోంది. మోటార్ ముందు చక్రాలకు శక్తిని అందిస్తుంది. ఈ కారు 134bhp పవర్, 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎకో, ఎకో+, నార్మల్, స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. విండ్‌సర్ ఈవీ టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 మరియు హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి కార్లకు పోటీ ఇస్తోంది.
విండ్‌సర్ ఈవీ ఫీచర్లు:
కొత్త విండ్‌సర్ డిజైన్ చాలా ఆధునికంగా ఉంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, A-పిల్లర్-మౌంటెడ్ ORVMలు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రియర్ బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ హోల్డర్, లెఫ్ట్ ఫ్రంట్ ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. కారు ఇంటీరియర్‌లో 15.6-అంగుళాల ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హారిజాంటల్ మౌంటెడ్ AC వెంట్స్, డ్యూయల్-టోన్ అప్‌హోల్‌స్టరీ, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ AC వెంట్స్, త్రీ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.