Mahindra: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా తన ఒక బైక్ లాంచింగ్‌ను వాయిదా వేసింది. అప్పుడు అందరూ ఆనంద్ మహీంద్రాను ఆకాశానికెత్తేశారు. కానీ మహీంద్రాను నిజంగా మెచ్చుకోవాల్సింది అది తయారుచేసిన ఈ ప్రత్యేకమైన కారు కోసం. ఇది యుద్ధరంగంలో దేశ సైనికుల ప్రాణాలు కాపాడటమే కాకుండా, శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.
ఈ కారు మరేదో కాదు.. Mahindra Marksman! ఇది భారతదేశపు మొట్టమొదటి ఆర్మర్డ్ క్యాప్సూల్ బేస్డ్ ఇన్ఫాంట్రీ మొబిలిటీ కారు. ఇది యుద్ధ భూమిలో సైన్యానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. ఈ వాహనం ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం. అంటే దీని బాహ్య డిజైన్ మందపాటి ఇనుప రేకులతో తయారు చేశారు. ఇది దానిని బుల్లెట్ ప్రూఫ్‌గా చేస్తుంది. అంతేకాదు, దీనికి కామోఫ్లాజ్ కలర్ థీమ్‌ను ఉపయోగించారు. ఇది యుద్ధ క్షేత్రానికి దీన్ని అత్యంత పవర్ ఫుల్ గా చేస్తుంది. దీని డిజైన్ శత్రువులను మోసం చేయడంలోనూ, సైనికులను రక్షించడంలోనూ చాలా నిపుణమైనది.
ఈ వాహనంలో డ్రైవర్, కో-డ్రైవర్‌తో సహా మొత్తం ఆరుగురు కూర్చోవచ్చు. దీని ఆఫ్-రోడ్ కెపాసిటీ ఎలాంటి భూభాగంలోనైనా, యుద్ధ క్షేత్రంలోనైనా సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. ఈ వాహనాన్ని ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టడానికి, అల్లర్లను అరికట్టడానికి, ప్రత్యేక దళాల ఆపరేషన్లలో ఉపయోగిస్తారు.
మహీంద్రా మార్క్స్‌మన్ పవర్
మహీంద్రా మార్క్స్‌మన్‌లో 2.2 లీటర్ల ఎమ్-హాక్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంటుంది. దీనితో పాటు, 2.6 లీటర్ల టర్బోచార్జ్డ్ DI ఇంజన్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. రెండు ఇంజన్ ఆప్షన్లతోనూ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. భారతీయ సైన్యం 2009 నుంచి ఈ వాహనాన్ని ఉపయోగిస్తోంది. మహీంద్రా ఇప్పుడు ఈ కారును BS-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా కూడా తయారు చేస్తోంది.