Mahindra : దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్ 2025లో మహీంద్రా అండ్ మహీంద్రా ఏకంగా టాటా మోటార్స్, హ్యుండాయ్ మోటార్ ఇండియాను వెనక్కి నెట్టి, దేశంలోనే రెండవ అతిపెద్ద ప్యాసింజర్ వెహికల్ (PV) తయారీదారుగా అవతరించింది. గత నెలలో మహీంద్రా తన మొత్తం అమ్మకాల్లో 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏకంగా 84,170 వాహనాలను విక్రయించింది.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. దేశీయ మార్కెట్‌లో మహీంద్రా SUV (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) అమ్మకాలు ఏకంగా 28 శాతం పెరిగి 52,330 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 41,008 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాల (Commercial Vehicles) దేశీయ అమ్మకాలు కూడా 22,989 యూనిట్లుగా నమోదయ్యాయి. మహీంద్రా ప్రస్తుతం భారతదేశంలో బొలెరో, బొలెరో నియో, XUV 3XO, థార్, థార్ రాక్స్, స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్, XUV700 వంటి పాపులర్ SUVలను విక్రయిస్తోంది. ఇవన్నీ పెట్రోల్, డీజిల్ మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పోర్ట్‌ఫోలియోలో XUV400, BE 6, XEV 9e వంటి మోడళ్లు ఉన్నాయి.
Also Read : చిన్న కుటుంబానికి బెస్ట్ ఆప్షన్.. మహీంద్రా XUV 3XO స్పెషాలిటీ ఇదే!
మరోవైపు, ఏప్రిల్‌లో టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు వార్షికంగా 5.60శాతం తగ్గి 45,199 యూనిట్లకు చేరాయి. హ్యుండాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు కూడా వార్షిక ప్రాతిపదికన 11.61శాతం తగ్గి 44,374 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా పీవీ పోర్ట్‌ఫోలియోలో టియాగో, టియాగో.ఈవీ, ఆల్ట్రోజ్, టిగోర్, టిగోర్.ఈవీ, పంచ్, పంచ్.ఈవీ, నెక్సాన్, నెక్సాన్.ఈవీ, కర్వ్, కర్వ్.ఈవీ, హారియర్, సఫారి వంటి మోడళ్లు ఉన్నాయి. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా, వెర్నా, ఎక్స్టర్, వెన్యూ, క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్ (ఈవీ), అల్కాజార్, టక్సన్, అయోనిక్ 5 వంటి కార్లను విక్రయిస్తోంది.
దేశీయ మార్కెట్‌లో ట్రాక్టర్ అమ్మకాలు కూడా గత నెలలో ఎనిమిది శాతం పెరిగి 38,516 యూనిట్లుగా ఉన్నాయి, ఇది ఏప్రిల్ 2024లో 35,805 యూనిట్లుగా ఉంది. కంపెనీ ఎగుమతులు ఏప్రిల్ నెలలో 25 శాతం పెరిగి 1,538 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది గత ఏడాది ఇదే నెలలో 1,234 యూనిట్లుగా ఉంది.
Also Read : కలలో కూడా ఈ ఆఫర్ ఊహించలేం.. మహీంద్రా ఆ మోడల్ పై రూ.1.15లక్షలు ఆదా