LIC: దేశంలో జీవితబీమాలో అగ్రగామిగా ఉన్న సంస్థ ఎల్‌ఐసీ (LIC). తాజాగా ఎల్‌ఐసీ ఆరోగ్య బీమారంగం(Health Insurance) రంగంలోకి అడుగు పెట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగా కొనుగోళ్లపై దృష్టిసారించనుంది. ఎల్‌ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ ఇంగ్లిష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించిన కాంపోజిట్ లైసెన్స్‌ను అనుసరించి ఆరోగ్య బీమాకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వంలో కాంపోజిట్ లైసెన్స్ లభించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అయితే సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని, అందుకే ఇన్ ఆర్గానిక్‌గా ఎదగాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
పార్లమెంట్ ప్రతిపాదనతో..
ప్రస్తుత నిబంధనల ప్రకారం జీవిత బీమా కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అందించడానికి వీలు లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి కమిటీ సూచించింది. దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతోపాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
చట్ట సవరణ అయితే..
పార్లమెంటరీ కమిటీ సూచనల మేరకు కొత్త ప్రభుత్వం ఇన్సూరెన్స్ చట్టంలో సవరణలు చేస్తే ఎల్‌ఐసీ ఆరోగ్య బీమారంగంలోకి వరావడం ఖాయం. ఇదే జరిగితే బీమా కవరేజీ విస్తృతి పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్సుల ఆదాయం పడిపోతుంది. ప్రభుత్వరంగ సంస్థ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపుతారు. జూన్ 4 తర్వాత దేశంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.