Adani Group LIC Investment: “అదానీ గ్రూపుల్లో రెండు సంస్థల్లో 3.4 బిలియన్ డాలర్లు బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. అదాని పోర్ట్స్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కు రేటింగ్ ఏజెన్సీలు ఏఏఏ రేటింగ్ ఇచ్చాయి. ఇందులో పెట్టుబడి పెడితే 7.5% నుంచి 7.8 శాతం వరకు ఆదాయం ఆఫర్ చేశారు. ఏఏఏ క్రెడిట్ రేటింగ్ ఉంటే అది ప్రభుత్వ బాండ్లతో సమానం. 10 సంవత్సరాల లాకిన్ పీరియడ్ లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెడితే 7.2 శాతం మాత్రమే ఆదాయం వస్తుంది. అదానీ గ్రూపులోని రెండవ టాప్ సంస్థ ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్… దీనికి ఏఏ రేటింగ్ వచ్చింది. ఇందులో పెట్టుబడి పెడితే 8.2 శాతం ఆదాయం ఆఫర్ చేసింది. ” అదానీ గ్రూప్ పై సంచలన కథనాలను ప్రచురించే క్రమంలో వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన విషయాలు ఇవి.
వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన కథనాల మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. మన దేశంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విదేశీ మీడియాను మాత్రమే నమ్ముతుంది కాబట్టి.. వాషింగ్టన్ పోస్టు కథనాలను ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. గతంలో హిండెన్ బర్గ్ ఇవే ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఆ సంస్థ పని ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ కూడా అలాంటి కథనాలనే ప్రచురించింది.. ముఖ్యంగా అదాని గ్రూపును లక్ష్యంగా చేసుకొని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకొని వాషింగ్టన్ పోస్టు ఈ కథనాన్ని ప్రచురించినట్టు అర్థమవుతోంది..
“ఈ సంక్షోభాలు రాకమందు ఎల్ఐసి అదానీ గ్రూప్ సంస్థల్లో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. అదానీ ని ఆదుకునేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని వెనుక ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, ఎల్ఐసి, నీతి అయోగ్ అధికారులు ఉన్నారు. దీనికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. దీని వెనుక ఉన్న అధికారులు ఈ విషయం మొత్తాన్ని మాకు వెల్లడించారు. ఎల్ఐసి తో డబ్బులు ఇప్పించడం మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలలో ఉన్న పెట్టుబడిదారుల్లో అదానీ కంపెనీల పై విశ్వాసాన్ని పెంచే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈ గ్రూపు అప్పులు సంస్థ విలువలు 20 శాతానికి చేరుకున్నాయి. అందువల్లే ఎల్ఐసి సంస్థతో 3.9 బిలియన్ డాలర్ల కమిట్మెంట్ చేయించడం వెనుక ప్రభుత్వం ఉంది. ఆదాని విలువను పెంచేందుకు ప్రభుత్వం తెర వెనుక పని చేసిందని” వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.
అంతర్జాతీయంగా అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని వాషింగ్టన్ పోస్ట్ తన కథనం ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. ఎల్ఐసి లాంటి సంస్థల్లోని ప్రజాధనాన్ని అదానీ గ్రూపులో పెట్టుబడిగా పెట్టించడం సరికాదని వాషింగ్టన్ పోస్టు తన కథనం ద్వారా స్పష్టం చేసింది.. భారత ప్రభుత్వానికి మరేమీ పని లేదన్నట్టుగా.. ఇంతకంటే ముఖ్యమైన ఘట్టం మరొకటి లేదన్నట్టుగా.. అదానీ కొమ్ము కాసిందని.. ఇది క్రోని క్యాపిటలిజానికి అద్దం పడుతోందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ప్రఖ్యాత ఆస్ట్రేలియా ఆర్థిక నిపుణుడు టీం బర్కలే చేసిన వ్యాఖ్యలను వాషింగ్టన్ పోస్ట్ ఈ విధంగా స్పందించడం విశేషం. ఈ కథనాన్ని ప్రచురించిన తర్వాత వాషింగ్టన్ పోస్ట్ ఆదాని గ్రూప్ స్పందన కోసం సంప్రదించగా.. “మా సంస్థల్లో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అందులో ఎల్ఐసి కూడా ఒకటి. ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన మద్దతు లేదు. మేము మోడీ అధికారంలోకి రాకముందే వ్యాపారాన్ని మొదలుపెట్టాం. వేగంగా ఆర్థిక అభివృద్ధి చెందే సంస్థగా ఎదిగాం. ఇలాంటి ఆరోపణలు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేవని” అదానీ గ్రూప్ చెప్పిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.