Lamborghini : కళ్లు చెదిరే వేగం, ఊహకందని ఎనర్జీ ఇండియాలో లాంచ్ అయిన ఈ సూపర్ కార్ చూస్తే ఇది కారా లేక ఫైటర్ జెట్టా అన్న అనుమానం రాకమానదు. గంటకు 343 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రాకెట్ లాంటి కారు ధర వింటే తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిందే. లగ్జరీ సూపర్ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజం లాంబోర్ఘిని ఇండియాలో తన సరికొత్త హై-పెర్ఫార్మెన్స్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సూపర్ కారను రిలీజ్ చేసింది. లాంబోర్ఘిని టెమెరారియో (Lamborghini Temerario) పేరుతో పిలువబడే ఈ అద్భుతమైన కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు సూపర్ కార్ బ్రాండ్ లైనప్‌లో బాగా పాపులర్ అయిన హురాకాన్ మోడల్‌ను భర్తీ చేస్తుంది. ఈ సూపర్ కార్ గతేడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది. సరిగ్గా 8 నెలల తర్వాత ఇప్పుడు ఇది ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త సూపర్ కార్ కంపెనీకి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) కారు. దీనిని ఎలక్ట్రిక్ కారులా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read : ఒకేసారి 5 కొత్త కార్లతో భారత మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెనాల్ట్ రెడీ
లాంబోర్ఘిని టెమెరారియో 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పనిచేస్తుంది. V8 ఇంజన్ ఒక్కటే 789 bhp పవర్, 730 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ మోటార్లు అదనంగా 295 bhp పవర్, 2,150 Nm టార్క్‌ను అందిస్తాయి. ఈ రెండింటి అవుట్‌పుట్ కలిస్తే 907 bhp వరకు చేరుకుంటుంది. ఈ కారు గంటకు 343 కిలోమీటర్ల టాప్ స్పీడుతో దూసుకుపోగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాదు, ఈ సూపర్ కార్ కేవలం 2.7 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. హైబ్రిడ్ సిస్టమ్ కోసం 3.8 kWh బ్యాటరీ వస్తుంది. దీనిని 7 kW AC ఛార్జర్‌ను ఉపయోగించి 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీ రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా రీఛార్జ్ అవుతుంది.
ఈ సూపర్ కార్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. షార్క్-నోస్ తరహా ముందు భాగం, లోయర్ లిప్ స్పాయిలర్, హెక్సాగోనల్ LED DRLలు దీని ప్రత్యేకమైన లుక్ మరింత ఎట్రాక్టివ్ గా చేస్తున్నాయి. వెనుక వైపున హెక్సాగన్-థీమ్ టెయిల్‌లైట్లు, మధ్యలో అమర్చిన ఎగ్జాస్ట్ , ఏరోడైనమిక్ ORVMలు లాంబోర్ఘిని ప్రత్యేకమైన డిజైన్‌ను ప్రతిబింబిస్తాయి. ఇందులో ముందు వైపు 20-ఇంచుల, వెనుక వైపు 21-ఇంచుల టైర్లు ఉన్నాయి. ఇది అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ వీల్ కూడా కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 10-పిస్టన్ కాలిపర్‌లతో 410 మిమీ డిస్క్‌లు, వెనుక భాగంలో 4-పిస్టన్ కాలిపర్‌లతో 390 మిమీ డిస్క్‌లు ఉన్నాయి.
లోపలి భాగం ఒక ఫైటర్ జెట్ కాక్‌పిట్‌ను పోలి ఉంటుంది. ఇది రెవుల్టోను గుర్తు చేస్తుంది. అంతేకాకుండా ఈ సూపర్ కార్‌లో 12.3-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8.4-ఇంచుల నిలువు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 9.1-ఇంచుల కో-డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. ఇవి అనేక లేటెస్ట్ ఫీచర్లతో నిండి ఉన్నాయి. ఈ సూపర్ కార్‌లో వెంటిలేటెడ్, హీటెడ్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల సీట్లు, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఈ కారులో 13 డ్రైవ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.