ATM Charges : సామాన్యుడిపై మరో భారం పడనుంది. రేపటి నుంచి ఏటీఎం ద్వారా చేసే లావాదేవీలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు అనుమతి ఇవ్వడంతో బ్యాంకులు తమ వసూళ్లును పెంచుకోవడానికి రెడీ అయ్యాయి. ఇకపై ఉచిత నెలవారీ పరిమితి దాటిన ప్రతి లావాదేవీకి వినియోగదారులు రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, బ్యాలెన్స్ ఎంక్వైరీ (నిల్వ తనిఖీ) వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు కూడా ఇప్పుడున్న రూ.6 ఛార్జీ నుంచి రూ.7కు చేరనుంది. వినియోగదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో మూడు సార్లు, నాన్-మెట్రో నగరాల్లో ఐదు సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఈ పరిమితి దాటితే మాత్రం మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.
Also Read : ఒకేసారి 5 కొత్త కార్లతో భారత మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెనాల్ట్ రెడీ
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. వినియోగదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3 ఉచిత లావాదేవీలు (మెట్రో నగరాల్లో) లేదా 5 ఉచిత లావాదేవీలు (నాన్-మెట్రో నగరాల్లో)చేసుకునే అవకాశం ఉండేది. అయితే, మే 1, 2025 నుంచి ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.23 ఛార్జీ పడుతుంది. ఇది నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది.
సాధారణంగా చాలా మంది వినియోగదారులు తమ ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగిస్తుంటారు. ఇప్పటివరకు దీనికి నామమాత్రపు ఛార్జీ ఉండేది. కానీ రేపటి నుంచి బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి వాటికి కూడా రూ.7 వరకు ఛార్జీ విధించనుండడం వినియోగదారులకు పెద్ద షాక్‌గా పరిగణించవచ్చు.
ఏటీఎంల మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం, టెక్నాలజీను అభివృద్ధి చేయడం వంటి కారణాల వల్ల బ్యాంకులు ఏటీఎం ఛార్జీలను పెంచాలని ఆర్‌బీఐని కోరాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ఆర్‌బీఐ ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ నిర్ణయం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతోనే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.