Komaki Electric : రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి లేదా చిన్న చిన్న పనులకు బండి మీద వెళ్లడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని బాధపడుతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ కొమాకి ఎలక్ట్రిక్ తన కొత్త ఎక్స్‌ఆర్1 సిరీస్ మోపెడ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ అడ్వాన్స్‌డ్ వాహనం రీజనరేటివ్ కైనెటిక్ ఎనర్జీ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అంటే, బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా ఈ బండిని నడపొచ్చు. కాబట్టి, సగం దారిలో బ్యాటరీ అయిపోతుందేమో అన్న భయం ఇక ఉండదని కంపెనీ చెబుతోంది.
ఈ మధ్య వస్తున్న ఆధునిక సైకిళ్ల ధరలే రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఉంటున్నాయి. అయితే, ఈ కొమాకి మోపెడ్ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు. భారతదేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.29,999 మాత్రమే. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ స్కూటర్ చాలా బాగుంటుందని కంపెనీ చెబుతోంది.
ఈ స్కూటర్‌లో ఉన్న ప్రత్యేకత దాని రీజనరేటివ్ పవర్ సిస్టమ్. దీనివల్ల ప్రధాన బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా బండిని నడపవచ్చు. అంటే, బ్యాటరీ మీటర్ సున్నాకు చేరినా సరే, ఈ అద్భుతమైన టెక్నాలజీ వల్ల ఈ ఎలక్ట్రిక్ వాహనం ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ ఎండ్ లెస్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కొమాకి చెబుతోంది.
అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల, ఎక్స్‌ఆర్1 జీరో-ఎమిషన్ రైడ్‌ను అందిస్తుంది. ఇందులో ఉన్న ఎర్గోనామిక్ డ్యూయల్ సీట్లు డ్రైవర్‌కు, వెనుక కూర్చునే వారికి ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది. ముందు భాగంలో స్పెషియస్ ఫ్రంట్ బాస్కెట్ ఉండటం వల్ల కిరాణా సామాన్లు, బ్యాగులు లేదా రోజువారీ అవసరమైన వస్తువులను సులభంగా తీసుకెళ్లవచ్చు.