Joy Alukkas: ఒక్కోసారి మనకు ఎదురయ్యే అవమానాలు, ఎదురుదెబ్బలు, ఛీత్కారాలు మనల్ని జీవితంలో ఎదిగేలా చేస్తాయి. వీటన్నింటినీ దాటుకుంటే వెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ఎవరో ఏదో అన్నారని అవమానంగా వెనక్కి తగ్గితే ఇక మనం ఎదగలేం. ఉన్న చోటే ఆగిపోయి ఫెయిల్యూర్స్ ను చూడాల్సి ఉంటుంది. ఇలా జీవితంలో అవమానాలనే దాటుకొని జీవితంలో సక్సెన్ అందుకొని ఉన్నతస్థానాల్లో ఉన్నవారెందరో మన కళ్ల ముందు ఉన్నారు. ఒక్కోసారి వారి ప్రయాణం, జీవిత చరిత్ర మనకు ఆదర్శంగా కనిపిస్తుంటుంది. ఇదే కోవలోకి వస్తారు జోయాలుక్కాస్ గ్రూప్ అధినేత జాయ్ అలుక్కాస్. ఇటీవల ఆయన ఒక జాతీయ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి పంచుకున్నారు. ఈ సంఘటనను తన జీవితంలో మరిచిపోలేనిదని అన్నారు. అయినా దాని నుంచి బయటపడి సాగించిన ప్రయాణాన్ని వివరించారు. ఒక్కసారి అదేంటో చూద్దాం. తనకు జరిగిన అవమానం గురించి ఆయన మాటల్లోనే. ‘నాకు ఈ అనుభవం 2000 సంవత్సరంలో ఎదురైంది. ఒక రోజు రోల్స్ రాయిస్ కారు చూడాలని అనిపించింది. దీంతో నేను ఓ షోరూమ్ కు వెళ్లా. అక్కడున్న సిబ్బంది వచ్చిన కస్టమర్ ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించకుండా.. హేళనగా మాట్లాడారు. నాకు ఎదురైన వారు నాతో ‘నువ్వు కారు కొనాలనుకుంటున్నావా? నీకు కావాల్సిన కారు ఇక్కడ లేదు..ఉండదు. వేరే షోరూమ్ కు వెళ్లు’ అంటూ నవ్వుతూ చెప్పారు. ఆ సమయంలో రోల్స్ రాయిస్ కొనే వారు అతి తక్కువగా ఉండేవారు.
దీంతో ఆ షోరూం సిబ్బంది ప్రవర్తనతో చాలా బాధపడ్డా. అప్పుడే అనుకున్నా. ఎలాగైనా అదే కారు కొనాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్లుగానే ఆఖరికి ఆ కారునే కొన్నా. ” అంటూ గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అయితే నాడు అవమానం ఎదురైంది కాబట్టి అలా ఫీలయ్యానని చెప్పారు. కానీ కారు కొన్నాక ఇంత లగ్జరీ కారు అవసరం లేదని అనిపించినట్లు ఆయన చెప్పారు. అందుకే ఆ కారును దుబాయిలో వేగంగా విస్తరిస్తున్న తన ఆభరణాల వ్యాపారానికి ప్రచార సాధనంలా వినియోగించాలని అనిపించింది.
ఇక తన సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక డ్రాలో గెలిచిన వారికి ఆ కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించాను. ఇంకేం దుబాయిలో ఈ ప్రకటన పెద్ద సంచలనంగా మారింది. ఇక అప్పుడే జాయ్ అలుక్కాస్ సంస్థ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటనే పశ్చిమాసియాలోనే ప్రముఖ బంగారు రీటైలర్ ఎదిగేలా ఉపయోగపడింది. ప్రస్తుతం బంగారం వ్యాపారాల్లో ప్రముఖ కంపెనీల జాబితాలో చేరింది.
జాయ్ అలుక్కాస్ ప్రస్థానం మీకు తెలుసా..?
జాయ్ అలుక్కాస్ చిన్ననాడు స్కూల్ డ్రాపౌట్. 1987లో వ్యాపారం కోసం వారి కుటుంబం అబుదాబీ వెళ్లింది. ఆ తర్వాత కొన్నేండ్లకు తండ్రికి చెందిన అభరణాల వ్యాపారం నుంచి ఆయన బయటకు వచ్చేశారు. సొంతంగా జోయాలుక్కాస్ వ్యాపారాన్ని స్థాపించారు. ప్రస్తుతం జాయ్ అలుక్కాస్ సంస్థకు విదేశాల్లో 80, భారత్ లో 100కు పైగా స్టోర్లు ఉన్నాయంటే దాని వెనుక ఆయన శ్రమ ఎంతో ఉంది. కొన్న రోజుల క్రితం వెలువడిన ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 2023 నాటికి ఆయన సంపద 4 బిలియన్ డాలర్లు. ఇక ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాది విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో జాయ్ అలుక్కాస్ 12వ స్థానంలో ఉన్నాడు.