Indigo Airlines : భారత దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. నగరాలు, చిన్న పట్టణాల్లోకి కూడా విమానాలు రానున్నాయి. ఉడాంగ్ పథకంలో భాగంగా చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఇటీవలే అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణలోనే కొత్తగా మూడు ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఇండియాలో విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇటీవలే ఒకే రోజు 5 లక్షల మంది విమానాల్లో ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారు. సమయాభావం, అవసరాల దృష్టా దేశంలోని వివిధ నగరాలకు వెళ్లేవారు కూడా విమానాలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో దేశీయంగా కూడా విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. దీంతో అంతర్గతంగా విమానాలను కూడా సంస్థలు పెంచుతున్నాయి. ఇక ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయాణికులకు ఆఫర్లు ఇస్తున్నాయి. ఇటీవలే ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఎక్స్‌ప్రెస్ చార్జీల్లో రాయితీ ఇచ్చింది. తాజాగా ఇండిగో సంస్థ కూడా కొత్త ఆఫర్ తెచ్చింది.
స్టూడెంట్స్ కోసమే..
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విద్యార్థుల కోసం స్టూడెంట్ స్పెషల్ అనే ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఇండిగో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఫ్లైట టికెట్ బుక్ చేసుకునే సమయంలో విద్యార్థులక ప్రత్యేక చార్జీలు, అదనపు ప్రయోజనాలు లభించనున్నట్లు ప్రకటించింది. టికెట్ చార్జీలో 6 శాతం రాయితీతోపాటు 10 కేజీల వరకు అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది. విద్యార్థుల కోసం తెచ్చిన ఈ స్పెషల్ ఆఫర్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉంటుంది అనేది మాత్రం వెల్లడించలేదు.
80 రూట్లలో సర్వీసులు..
ఇదిలా ఉంటే ఇండిగో ప్రకటించిన స్పెషల్ ఆఫర్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా గోవా, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మొత్తం 80 రూట్లలో నడిచే విమాన సర్వీసులకు వర్తిస్తుందని వెల్లడించింది. 21 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న విద్యార్థులు తమ స్కూల్ లేదా యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డు కలిగి ఉండాలని తెలిపింది. ఐడీ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. లేదంటే అనర్హులు అవుతారని తెలిపింది.