Indian Women: భారతీయ మహిళలు కేవలం గృహాలకు మాత్రమే పరిమితం కాకుండా, అన్ని రంగాలలో తమ సత్తాను చాటుతున్నారు. ఆర్థిక రంగం, టెక్నాలజీ, కళలు, స్టార్టప్‌ల (Start-ups) వంటి వివిధ రంగాలలో మార్పునకు కారణమవుతున్న 97 మంది స్ఫూర్తిదాయకమైన భారతీయ మహిళలను గుర్తిస్తూ..కాండెర్ హురున్ ఇండియా (Candere and Hurun India) సంయుక్తంగా 2025 సంవత్సరానికి గాను తొలి ‘కాండెర్ హురున్ ఇండియా మహిళా నాయకుల జాబితా’ ను విడుదల చేశాయి. ఈ జాబితాలో నిలిచిన మహిళలు తమ అసాధారణమైన నాయకత్వ లక్షణాలతో దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు.
అగ్రస్థానంలో నిలిచిన ప్రొఫెషనల్ మహిళలు
మార్కెట్ లీడర్‌షిప్‌ను పరిగణనలోకి తీసుకుంటూ వారు నాయకత్వం వహిస్తున్న కంపెనీల విలువ ఆధారంగా అగ్రశ్రేణి 10 మంది మహిళా ప్రొఫెషనల్స్‌కు ర్యాంకులు ఇచ్చారు.
శాంతి ఏకాంబరం (Shanti Ekambaram): కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శాంతి ఏకాంబరం, తన కంపెనీ విలువ రూ.3.81 లక్షల కోట్లు కావడంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
పర్మిందర్ చోప్రా (Parminder Chopra): పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (Power Finance Corp) ఛైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన పర్మిందర్ చోప్రా, తన కంపెనీ విలువరూ.1.44 లక్షల కోట్లతో ఆమె తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ జాబితా దేశంలోని ఆర్థిక కార్పొరేట్ రంగాలలో మహిళల ఆధిపత్యాన్ని సూచిస్తుంది.
Read Also: రైతన్నకు శుభవార్త.. పీఎం కిసాన్ 20వ విడత డేట్ వచ్చేసింది.. ఈ పని త్వరగా చేసేయండి
అలాగే ఫస్ట్ జనరేషన్ వెల్త్ క్రియేటర్లుగా తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న మహిళల జాబితాలో రాధా వేంబు (Radha Vembu) ముందున్నారు.
రాధా వేంబు: జొహో (Zoho) సహ-వ్యవస్థాపకురాలు అయిన రాధా వేంబు రూ.55,300 కోట్ల వ్యక్తిగత సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆమె ఇండియా రిచ్ లిస్ట్ 2024, గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024, ఫిలాంత్రోపీ లిస్ట్ 2024 వంటి పలు ప్రతిష్టాత్మక జాబితాలలో కూడా స్థానం సంపాదించుకున్నారు.
జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal): అరిస్టా నెట్‌వర్క్స్ (Arista Networks) సీఈఓ అయిన జయశ్రీ ఉల్లాల్, రూ.48,900 కోట్ల వ్యక్తిగత సంపదతో ఈ విభాగంలో ఆమె తర్వాతి స్థానంలో ఉన్నారు.
తమ స్వయంకృషితో సంపదను సృష్టించుకున్న మహిళల జాబితా ఇది. వ్యాపార విలువలు, ఇన్వెస్ట్ మెంట్ అసెట్స్ లను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.
నెక్ట్స్ జనరేషన్ నాయకుల్లో రోష్నీ నాదర్ ముందంజ
నెక్ట్స్ జనరేషన్ నాయకుల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) ఛైర్‌పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) మొదటి స్థానంలో నిలిచారు. ఆమె నాయకత్వంలో హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 60 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ రూ.1.11 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించింది. 2025 మార్చిలో శివ్ నాదర్ (Shiv Nadar) తన హెచ్‌సీఎల్ షేర్లలో 47 శాతం రోష్ని నాదర్ మల్హోత్రాకు బహుమతిగా ఇవ్వడంతో ఆమె మెజారిటీ వాటాదారుగా మారారు. దీనితో ఆమె భారతదేశంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలో ఐదవ అత్యంత సంపన్న మహిళగా అవతరించారు.
ముంబై మహిళా నాయకత్వానికి కేంద్రం!
ఈ జాబితాలో ఉన్న 97 మంది మహిళలలో 38 మంది ముంబై కేంద్రంగా పనిచేస్తున్నారు. దీనితో ముంబై భారతదేశంలో మహిళా నాయకత్వానికి అతిపెద్ద కేంద్రంగా అవతరించింది. ఢిల్లీ 12 మందితో, బెంగళూరు 10 మంది నాయకులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతీయ యువ మహిళలు చాలా తక్కువ వయసులోనే నాయకత్వ స్థానాలను చేపడుతున్నారు. ఈ జాబితాలో ఉన్న మహిళల సగటు వయస్సు 51 సంవత్సరాలు. వారిలో సుమారు 25 శాతం మంది 26 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వారు.
Read Also: తొక్కిసలాట ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న డీకే శివకుమార్
అతి పిన్న వయస్కులు
మృణాల్ పాంచల్ (Mrunal Panchal): 26 ఏళ్ల మృణాల్ పాంచల్, ఎంఆర్‌యూచా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫౌండర్ విభాగంలో 5.5 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.
శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor): అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ ఇన్వెస్టర్ శ్రద్ధా కపూర్, 94.1 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో ముందున్నారు. ఆమె మైగ్లామ్, షూన్య వంటి బ్రాండ్‌లలో పెట్టుబడులు పెట్టారు.
దేవాన్షి కేజ్రీవాల్ (Devanshi Kejriwal): 28 ఏళ్ల దేవాన్షి కేజ్రీవాల్, స్కిల్‌మాటిక్స్ సహ-వ్యవస్థాపకురాలు, ఈ జాబితాలో అతి పిన్న వయస్సు గల వ్యాపార నాయకురాలు.
అర్పితా సింగ్ (Arpita Singh): మరోవైపు, 87 ఏళ్ల కళాకారిణి అర్పితా సింగ్ ఈ జాబితాలో అత్యంత వృద్ధురాలు. క్రియేటివిటీకి వయస్సుతో సంబంధం లేదని ఆమె నిరూపించారు.
రోహిణి నిలేకని (Rohini Nilekani): దాతృత్వ రంగంలో రోహిణి నిలేకని ప్రత్యేకంగా నిలిచారు. తన ఫౌండేషన్ ద్వారా రూ.154 కోట్లు విరాళంగా ఇచ్చారు.