Homeబిజినెస్India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.....

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం సేల్స్ డౌన్..

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో అత్యంత భారీ పతనాన్ని మూటగట్టుకుంది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ ‘కౌంటర్‌పాయింట్’ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఫోన్ల అమ్మకాలు ఏకంగా 10 శాతం పడిపోయాయి. అసలు ఈ ఫోన్ల అమ్మకాలు పడిపోవడానికి కారణాలేంటంటే?

కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా కొన్నింటి గురించి నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా 2026 ప్రథమార్ధంలో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరగడమే. గ్లోబల్ మార్కెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల డిమాండ్ విపరీతంగా పెరగడంతో.. స్మార్ట్‌ఫోన్లలో వాడే మెమరీ చిప్స్ కొరత ఏర్పడింది. సెప్టెంబర్ 2025 నుంచి ఇప్పటివరకు ఈ మెమరీ చిప్‌ల ధరలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. దీనివల్ల మొబైల్ కంపెనీలపై తయారీ వ్యయం భారం పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని ప్రముఖ బ్రాండ్లు వరుసగా ధరలను పెంచేశాయి. ఫలితంగా, జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి సగటు స్మార్ట్‌ఫోన్ ధర మార్కెట్‌లో 15 శాతం వరకు పెరిగింది.

ధరల పెరుగుదల ప్రభావం సామాన్యులు కొనుగోలు చేసే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా రూ.15,000లోపు మొబైల్ కొనే వారు ముందుకు రాకపోవడంతో ఈ బడ్జెట్ విభాగంలో ఫోన్ల అమ్మకాలు ఏకంగా 45 శాతం పడిపోవడం గమనార్హం. ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యావసరాల ఖర్చుల వల్ల సాధారణ వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. అటు తక్కువ ధరల్లో ఎక్కువగా లభించే చైనీస్ బ్రాండ్ల మార్కెట్ వాటా కూడా 2020 తర్వాత ఈ త్రైమాసికంలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది.

ఒకవైపు బడ్జెట్ ఫోన్ల మార్కెట్ కుదేలవుతున్నా.. రూ. 45,000 పైబడిన ప్రీమియం, అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగం మాత్రం నిలకడగా రాణించింది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, సులువైన ఫైనాన్సింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ఖరీదైన ఫోన్ల వైపు మొగ్గు చూపారు. ఈ త్రైమాసికంలో జరిగిన మొత్తం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో 50 శాతానికి పైగా ఫైనాన్స్ లేదా ఈఎంఐల ద్వారానే జరగడం విశేషం.

ఈ ఏడాది మిగిలిన భాగంలో కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ నాటికి కూడా చిప్స్ ధరలు తగ్గేలా కనిపించడం లేదు. ఈ కారణాల వల్ల 2026 పూర్తి సంవత్సరానికి గానూ భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తం మీద 13 శాతం మేర క్షీణతను నమోదు చేయవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version