India digital payments: తాగే టీ నుంచి వండుకునే కూరగాయల వరకు.. ప్రతిదీ మనకు నిత్యవసరమే. అయితే ఒకప్పుడు వీటిని కొనుగోలు చేయాలంటే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. చెల్లింపులకు డిజిటల్ యాప్స్ ఆవిష్కరించిన తర్వాత.. ఎవరు కూడా జేబుల్లో డబ్బులు వేసుకొని వెళ్లడం లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. స్కాన్ చేయడం.. చెల్లింపులు జరపడం.. ఇలానే సాగిపోతోంది వ్యవహారం.
ఒకప్పుడు మనదేశంలో ఏవైనా వస్తువుల కొనుగోళ్లకు.. లేదా అమ్మకాలకు కచ్చితంగా నగదు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే డిజిటల్ చెల్లింపులు తెరపైకి వచ్చాయో.. చెల్లింపులకు యాప్స్ అందుబాటులోకి వచ్చాయో.. అప్పటినుంచి పరిస్థితి మారిపోయింది. మొదట్లో ఈ డిజిటల్ చెల్లింపులు కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కోవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోవిడ్ సమయంలో బ్యాంకులు తెరుచుకోకపోవడంతో డిజిటల్ యాప్స్ వినియోగం అనేది తప్పనిసరిగా మారిపోయింది. దీంతో అప్పటినుంచి దేశంలో డిజిటల్ విధానంలో చెల్లింపులు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ఆర్.బి.ఐ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం మనదేశంలో ఏకంగా 85% డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతున్నట్టు తెలుస్తోంది. యూపీఐ అనేది దేశ డిజిటల్ ఎకానమీలో విప్లవంగా మారిందని ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ వెల్లడించడం విశేషం.
ప్రతినెలా మనదేశంలో 20 బిలియన్లకు పైగా చెల్లింపులు డిజిటల్ విధానంలో జరుగుతున్నాయి. ఫలితంగా యూపీఐ అనేది ఆర్థిక సాధారణంగా మాత్రమే కాకుండా, సామాజిక ఆర్థిక సమానత్వానికి సూచికగా నిలుస్తోంది. యూపీఐ వాడే విధానంలో అనేక మార్పులు తీసుకురావడంతో.. దీని పరిధి దేశాలు కూడా దాటింది. విదేశాలలో ఉన్న వారికి కూడా దీని ద్వారా డబ్బులు పంపించే సౌకర్యం పెరిగిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ ఉన్న మనదేశంలో డిజిటల్ విధానంలో చెల్లింపులు పెరిగిపోవడంతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక అరాచక శక్తుల ఆగడాలు తగ్గిపోయాయి. మోసాలు అనేవి లేకుండా పోయాయి. అయితే ఈ డిజిటల్ విధానంలో కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం రకరకాల మాయలు చేస్తున్నప్పటికీ.. చివరికి దొరికిపోతున్నారు.
యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్న డిజిటల్ యాప్స్ లలో ఫోన్ పే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పేటీఎం రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో గూగుల్ పే.. నాలుగు స్థానంలో అమెజాన్ పే.. కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కూడా డిజిటల్ చెల్లింపులు పెరిగిపోవడంతో ఊహించని పురోగతి కనిపిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. తద్వారా ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలు మరింత అవగాహన పెంచుకుంటున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో వెల్లడించడం విశేషం.