Home Lone: ప్రతీ ఒక్కరి కల సొంతిల్లు. తనకంటూ సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ దీనికి పెద్ద ఎత్తున డబ్బు అవసరం అవుతుంది. అందుకే బ్యాంకు నుంచి అప్పు (లోన్) తీసుకోక తప్పదు. ఎంత పెద్ద మొత్తానికైనా ఆ రేంజ్ లోనే ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఈఎంఐలు చెల్లించేందుకు రుణగ్రహీతలు 15-25 సంవత్సరాల కాలపరిమితిని ఎంపిక చేసుకుంటారు. ఇంత సుదీర్ఘ కాలం ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయంలో ఎక్కువ శాతం పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈ ఈఎంఐల చెల్లింపుల్లో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇంటి రుణ ఈఎంఐ తనకు వచ్చే ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి నెలవారీ బిల్లులు చెల్లించేందుకు ఇతర విషయాలపై ఖర్చు పెట్టేందుకు తగినంత డబ్బు మిగిలి ఉండదు. అందుకే ఒకరి రుణ ఈఎంఐ అతని ఆదాయంలో 50 శాతం కంటే తక్కువ ఉండేలా బ్యాంకులు జాగ్రత్త పడతాయి. కాబట్టి, ఇంటి రుణాలపై ఈఎంఐ భారం తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఒక వేళ గతంలో క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండకుంటే హౌసింగ్ లోన్ అధిక వడ్డీతో మంజూరవ్వచ్చు. ఆ తర్వాత రుణాలు క్రమ శిక్షణగా చెల్లించుకుంటూ పోతే క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుంది. కాబట్టి, ఆ సమయంలో కొనసాగుతున్న ఇంటి రుణంపై వడ్డీ రేటు తగ్గించాలని బ్యాంకును అభ్యర్థించడం మంచిది. ఎందుకంటే, గతంలో క్రెడిట్ స్కోర్ కారణంగా మీకు రుణాలు ఇవ్వని అగ్రశ్రేణి బ్యాంకులు ఇప్పుడు మీ స్కోర్ చూసి ఇచ్చేందుకు ముందుకు రావచ్చు. కాబట్టి, వడ్డీ రేటు తగ్గితే ఈఎంఐ తగ్గుతుంది.
ఈఎంఐ కాల వ్యవధి
రుణం తీసుకున్నవారు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లయితే ఇంటి రుణ ఈఎంఐ తగ్గించడం ద్వారా ఆర్థిక ఉపశమనం కలుగవచ్చు. దీంతో రుణ కాలవ్యవధి పెరుగుతుంది. కాలవ్యవధి పెరుగుదల రుణగ్రహీత పదవీ విరమణకు మిగిలి ఉండే కాలంపై ఆధారపడి ఉంటుంది. పదవీ విరమణకు గడువు దూరంగా ఉండి, ఎక్కువ కాలం ఉపాధి, ఉద్యోగంలో కొనసాగేవారికి ఈఎంఐ కాలవ్యవధి పెంచుకోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాల చెల్లింపులతో వడ్డీ భారం పెరిగినప్పటికీ, కొంత కాలానికి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాక్షికంగా ముందస్తు చెల్లింపులు చేయడం ద్వారా ఈఎంఐలను తగ్గించుకోవచ్చు.
రుణ బదిలీ
అనేక బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు హౌజింగ్ లోన్స్ అందిస్తున్నప్పటికీ, వారి వడ్డీ రేట్లలో తేడాలు ఉంటాయి. మీరు అధిక వడ్డీతో ఇంటి రుణం తీసుకొని ఉంటే.. దాన్ని రీఫైనాన్స్ చేసేందుకు ప్రయత్నించండి. ఇందులో మీ ప్రస్తుత రుణాన్ని తక్కువ వడ్డీ లేదా సరళమైన నిబంధనలు అందించే మరో బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. ఇలా చేసేందుకు ముందు పాత రుణ సంస్థకు ఈఎంఐలను సకాలంలో చెల్లించేలా చూడాలి. ఈఎంఐలు చెల్లించేప్పుడు పెనాల్జీలు, లేట్ పేమెంట్లు లేకుండా చూసుకోవాలి. చాలా వరకు రుణాలు ఫ్లోటింగ్ రేట్ పై ఆధారపడి ఉంటాయి. ఫ్లోటింగ్ రేటులో ఈఎంఐ వసూలు చేసిన బ్యాంకు రుణ బదిలీకి పెనాల్టీ/రుసుం వసూలు చేయదు. రుణం ఇచ్చే కొత్త బ్యాంకుకు కొంత వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తక్కువ వడ్డీకి రుణ బదిలీ చేస్తే ఈఎంఐ తగ్గుతుంది.
ఫిక్స్‌డ్ నుంచి ఫ్లోటింగ్ కు
మీరు ఫిక్స్ డ్ రేటు రుణంలో ఉంటే రుణ కాలవ్యవధిలో ఎక్కువ వడ్డీ రేటు చెల్లించి ఉంటారు. బ్యాంకులు ఫిక్స్‌డ్ రేటు రుణాలపై 1 శాతం నుంచి 2 శాతం అధిక రేటు వసూలు చేస్తాయి. గృహ రుణం పెద్ద మొత్తం కాకుండా దీర్ఘకాలం అధిక వడ్డీతో కూడిన ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 15 ఏళ్ల రుణ కాల వ్యవధికి రూ. 50 లక్షల రుణంపై వడ్డీ 10% నుంచి 9%కి తగ్గితే, ఈఎంఐ రూ. 53,730 నుంచి రూ. 50,713 తగ్గుతుంది. దీనివల్ల రుణ కాలవ్యవధిలో రూ. 5,43,047 వడ్డీ భారం తగ్గుతుంది. కాబట్టి, రుణంపై 1% వడ్డీ తగ్గినా రుణగ్రహీతకు ఈఎంఐ తగ్గి మెరుగైన ఆర్థిక ప్రయోజనం అందిస్తుంది. ఈ తగ్గుదలతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తం ఆదా అవుతుంది. ఫిక్స్‌డ్ రేటు రుణాన్ని ఫ్లోటింగ్‌కు మరిస్తే పెనాల్టీ చెల్లించినా, దీర్ఘకాలానికి ఈఎంఐ తగ్గడంతో రుణం తీసుకున్న వారికి ఆర్థిక మేలు కలుగుతుంది.
పాక్షిక చెల్లింపు
రుణగ్రహీతలు ఎటువంటి పెనాల్టీ లేకుండా ముందస్తు చెల్లింపులు చేసేందుకు అవకాశం కలిగి ఉంటారు. వీరు ఈఎంఐలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మీరు ఆఫీసులో బోనస్‌ను తీసుకున్నా.. లేదంటే అదనపు ఆదాయ వనరు కలిగి ఉన్నా ఆ మొత్తాన్ని ముందస్తు చెల్లింపులకు కేటాయించండి. పాక్షిక ముందస్తు చెల్లింపులు రుణ కాలవ్యవధిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. దీనివల్ల ప్రిన్సిపుల్ (అసలు) మొత్తం తగ్గుతుంది. ఫలితంగా.. రుణానికి సంబంధించి కాలపరిమితి తగ్గిపోతుంది. రుణ కాలవ్యవధి తగ్గించకూడదనుకుంటే ముందస్తు చెల్లింపుల తర్వాత ఈఎంఐని తగ్గించమని బ్యాంకును అడగవచ్చు. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది.
డౌన్ పేమెంట్
రుణం తీసుకునేటప్పుడు డౌన్ పేమెంట్ చెల్లించడం వల్ల మొత్తంలో గణనీయంగా తగ్గుతుంది. ఇది మీ హోమ్ లోన్ ప్రిన్సిపుల్ మొత్తాన్ని తగ్గించి, వడ్డీ చెల్లింపులను తగ్గిస్తుంది. రుణ కాల వ్యవధి ఎంపికను బట్టి, ఈఎంఐ తగ్గే అవకాశం ఉంది.