కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజా బడ్జెట్ లో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి బ్యాంక్ ఖాతాలో డబ్బులు దాచుకున్న వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై బ్యాంకులు దివాలా తీసినా బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారికి కేంద్రం బ్యాంక్ అకౌంట్ లో దాచుకున్న నగదును బట్టి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు ఇవ్వనుంది. గతేడాది కొన్ని బ్యాంకులు దివాళా తీసినట్టు వార్తలు రావడంతో బ్యాంక్ అకౌంట్ ఉన్న ఖాతాదారులు టెన్షన్ పడ్డారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు డబ్బులు దాచుకున్న వారికి వెనక్కు ఇచ్చేలా చూస్తామని చేసిన ప్రకటన బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త అనే చెప్పాలి. అయితే కేంద్రం బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందని ఎన్నికలు లేని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.
కేంద్రం ప్రధానంగా బడ్జెట్ లో వైద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి పెట్టింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ప్రయోజనం చేకూర్చేలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎంపీలు బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని.. బడ్జెట్ లో విభజన హామీలు, ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్ లో ఆదాయపు పన్ను శ్లాబులలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు.
మరోవైపు కేంద్రం చిన్నపరిశ్రమల నిర్వచనంలో కీలక మార్పులు చేసింది. 50 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల లోపు పెట్టుబడి పరిమితి వరకు చిన్న సంస్థలుగా కేంద్రం గుర్తించింది. రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతుందని కేంద్రం పేర్కొంది.