Hyundai Car Price : మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇప్పుడే బుక్ చేయండి.. లేదంటే వచ్చే నెలలో ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఏప్రిల్ 2025 నుండి దాని అన్ని మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందుకు ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడమే కారణమని కంపెనీ పేర్కొంది. ఈ కార్ల ధరల పెరుగుదల మోడల్, వాటి వేరియంట్స్ ను బట్టి మారుతుంది.
Also Read : మధ్యతరగతి కోసం తెచ్చిన కారు.. కొనే దిక్కులేక ఖాళీగా షోరూంలు..లబోదిబో అంటున్న వ్యాపారులు
హ్యుందాయ్‌తో పాటు.. కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ కూడా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల నుంచి తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు బుధవారం (మార్చి 19) ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తన వాహనాల ధరలను ఏప్రిల్ 2025 నుండి మూడు శాతం మేరకు పెంచబోతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కారు మోడల్, వేరియంట్ ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు. ఉత్పత్తి వ్యయం పెరుగుదల, వస్తువుల ధరలు పెరగడం , నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవడంతోనే ధరల పెంపు తప్పడం లేదని కంపెనీ తెలిపింది.
హోండా కార్స్ కూడా వచ్చే నెల నుండి దాని అన్ని మోడళ్లలో ధరల పెంపును ప్రకటించింది. అయితే, కంపెనీ తన వాహనాల ధరలను ఎంత పెంచబోతుందన్న విషయం మాత్రం స్పష్టం చేయలేదు. దీనికి ముందే మారుతి సుజుకి ఇండియా, కియా ఇండియా, టాటా మోటార్స్ కూడా వచ్చే నెల నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
ముడిసరుకు, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల టాటా మోటార్స్ తన కమర్షియల్ వెహికల్స్ ధరలను ఏప్రిల్ 1, 2025 నుండి 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్-బెంజ్ ఇండియా కూడా ఏప్రిల్‌లో ధరల సవరణను పరిశీలిస్తోందని మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.
యూరోతో పోలిస్తే రూపాయి బలహీనపడితేనే ఈ మార్పు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ ఏడాది జనవరిలోనే కంపెనీ ధరలను పెంచింది. లగ్జరీ కార్ల అమ్మకాలు మరో రెండు త్రైమాసికాల పాటు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రధాన కార్ల తయారీదారులు ధరలు పెంచుతున్నందున, పరిశ్రమ నిపుణులు రాబోయే నెలల్లో అమ్మకాల మీద ఏర్పడే ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తారు.