
మనలో చాలామందికి కొన్ని సందర్భాల్లో ఊహించని సమస్యల వల్ల డబ్బు అవసరమవుతుంది. ఎవరికి ఏ సమయంలో డబ్బు అవసరం అవుతుందో ఎవరూ చెప్పలేరు. అవసరానికి మన చేతిలో డబ్బులు లేకపోయినా ఇబ్బందులు పడక తప్పదు. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా రుణం పొందే అవకాశం ఉంటుంది. సులభంగా రుణం పొందాలని అనుకునే వాళ్లు క్రెడిట్ కార్డును వినియోగిస్తూ ఉంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ పై రుణం పొందవచ్చు.
అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ పై రుణం పొందడం వల్ల క్రెడిట్ లిమిట్ లాక్ కావడంతో పాటు సాధారణంగా చెల్లించాల్సిన వడ్డీతో పోలిస్తే ఎక్కువ మొత్తం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్లను అందిస్తున్నాయి. ఉద్యోగులు ఎవరైతే శాలరీ అకౌంట్ ను కలిగి ఉంటారో వారు ఈ రుణాన్ని సులభంగా పొందవచ్చు.
తక్కువ సమయంలో రుణం పొందడానికి ఉన్న ఆప్షన్లలో బంగారం కూడా ఒకటి. బంగారం తాకట్టు పెట్టడం ద్వారా కూడా సులభంగా రుణం లభిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు సైతం బంగారంపై తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తుండటం గమనార్హం. కొన్ని గంటల సమయంలోనే బంగారంపై రుణాలను పొందే అవకాశం ఉంటుంది. షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా సులువుగా రుణం పొందే ఛాన్స్ ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్లు, షేర్ల విలువలో దాదాపు సగం విలువ రుణంగా పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ లలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు సైతం 95 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. త్వరితగతిన రుణం తీసుకోవాలని భావించే వాళ్లకు ఈ ఆప్షన్లు బెస్ట్ ఆప్షన్లు అని చెప్పవచ్చు.