APY Scheme: ప్రతి ఒక్కరూ విరమణ వయస్సు తర్వాత కొంత ఆర్థిక వెసులుబాటు కోసం ఎదురు చూస్తుంటారు. దీని కోసం వివిధ మార్గాల్లో పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కేంద్రం తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకం అద్బుతంగా ఉంది. ప్రతి ఒక్కరికీ పొదుపు చేయడం అనేది ఎంతో ముఖ్యం. దీని ద్వారా కుటుంబ ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. అదే లేకుంటే అప్పుల దారి వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇది గ్రహించిన చాలా మంది పొదుపు చేయడం అలవాటు చేసుకుంటారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు పింఛను వెసులుబాటు ఉంటుంది. ప్రైవేట్ రంగ సంస్థల్లోనూ కొంత ఈపీఎఫ్ ద్వారా పించన్ తీసుకునే అవకాశం ఉంటుంది. వారికి ప్రైవేట్ సంస్థలు ఇందుకోసం వేతనంలో కొంత, సంస్థ కొంత కలిపి ఈపీఎఫ్ వో ట్రస్టీకి కొంత మొత్తం జమ చేస్తుంటాయి. కానీ, స్వయం ఉపాధి పొందే వారికి అలాంటి అవకాశం లేకుండాపోయింది. కూలీలు, ఆర్థికంగా వెనుకబడిన వారి పరిస్థితి విరమణ వయస్సు అనంతరం అగమ్యగోచరంగా ఉంది. ఇలాంటి వారి కోసమే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రతిరోజూ రూ.7 చెల్లించడం ద్వారా నెలకు రూ.5వేల పింఛన్ పొందే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ పెన్షన్ పథకం లోచేరి నెలనెలా జమ చేస్తున్నారు.
అటల్ పెన్షన్ యోజన పథకం చిన్న చిన్న సంస్థల్లో జీతాలు తీసుకునే కార్మికులు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల ప్రజలకు హామీ ఇవ్వబడిన నెలవారీ పథకం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికే దాదాపు 7 కోట్ల మంది లబ్ధి పొందడం విశేషం. ప్రీమియంల ఆధారంగా చాలా మంది పెన్షన్ కోసం పథకంలో జమ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏ బ్యాంకులోనైనా ఖాతా కలిగిన వారు ఈ ప్రీమియం కట్టుకోవచ్చు పోస్టాఫీసులో కూడా ఈ పథకం అందుబాటులో ఉంది.
ఈ పథకం ప్రయోజనాలెంటో మీకు తెలుసా..?
ఈ పథకంలో చేరాలనుకునే వారి వయస్సు 18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. 18 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెడితే నెలకు కనీసం రూ.210 కట్టాల్సి ఉంటుంది. అంటే రోజుకు కేవలం రూ.7 చొప్పున కడితే సరిపోతుంది. నెలకు రూ.210 పెట్టుబడి పెట్టడం ద్వారా 60 ఏళ్ల వయసులో వారు నెలకు రూ.5వేలు పింఛన్ గా పొందుతారు. మనం కట్టే ప్రీమియాన్ని బట్టి పింఛన్ పెరుగుతూ ఉంటుంది.
ఇక ఈ పథకంలో నెలవారీగానే కాకుండా 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి కూడా చెల్లించవచ్చు. దీని ప్రకారం ప్రతి 3 నెలలకోసారి అయితే రూ.626 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రతి 6 నెలలకోసారి అయితే రూ.1,239 చెల్లించాల్సి వస్తుంది. ఇలా కూడా కట్టేందుకు చాలా మంది వెనుకాడడం లేదు. దీంతో ప్రస్తుతం అటల్ పెన్షన్ యోజనలో పెద్ద సంఖ్యలో చేరి పెట్టుబడి పెడుతున్నారు. విరమణ వయస్సు వచ్చాక వారికి కొంత ఆర్థిక తోడ్పాటు ఉంటుందని ఇందులో పెట్టబడి పెడుతున్నారు.