YCP: వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో పార్టీలో ఉండేది ఎవరు? బయటకు వెళ్లిపోయేది ఎవరు? ప్రచారం జరుగుతున్నట్టు మరో ఏడుగురు వెళ్లిపోతారా? వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు? టిడిపిలో చేరుతారా? జనసేనలోకి వెళ్తారా? లేకుంటే బీజేపీలో జాయిన్ అవుతారా? ఇప్పుడు ఇదే బలమైన చర్చ. రాజ్యసభ సభ్యుల అవసరం ఆ మూడు పార్టీలకు ఉంది. కానీ పార్టీ మారే అవసరం వైసిపి రాజ్యసభ సభ్యులకు ఉందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. వైసిపి తో పాటు రాజ్యసభ స్థానానికిమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు.వారిద్దరి అవసరాలు ఉన్నాయి. అందుకే వారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో రేపల్లె టిక్కెట్ ఆశించారు మోపిదేవి వెంకటరమణ. జగన్ మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ అసంతృప్తి మోపిదేవి లో ఉంది. అయితే బీదా మస్తాన్ రావుఅవసరం కోసం వైసీపీలో చేరారు.రాజ్యసభ పదవి దక్కించుకున్నారు. ఆయన టిడిపికి అత్యంత ఆప్తుడు. అందుకే ఆ పార్టీ అధికారంలోకి రావడంతో వెతుక్కుంటూ వెళ్తున్నాడు.
* వారిద్దరూ సొంత మనషులు
మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యుల్లో జగన్ సొంత మనుషులు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు వైవి సుబ్బారెడ్డి. జగన్ కు స్వయానా బాబాయ్. పార్టీ కీలక నేతగా కూడా ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని విడిచిపెట్టి వెళ్ళరు. మరొకరు విజయసాయిరెడ్డి. వైసిపి ఆవిర్భావించక ముందే ఆయన జగన్ వెంట అడుగులు వేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. జగన్ తో పాటే 16 నెలల జైలు జీవితం అనుభవించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నెంబర్ టు గా ఉన్నారు. ఆయన జగన్ ను విడిచిపెట్టే ఛాన్స్ లేదు. ఆయనను ఇతర పార్టీలు చేర్చుకునే అవకాశం లేదు. అయితే మిగతా ఏడుగురు రాజ్యసభ సభ్యుల విషయంలో.. పార్టీ మారే ఛాన్స్ ఉంటుందా? లేదా? అన్నదే ఇప్పుడు చర్చ.
* జగన్ కు అత్యంత విధేయుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. జగన్ కోసం కాంగ్రెస్ పార్టీలో పదవి వదులుకున్నారు. ఎంతో ఒత్తిడి ఉన్న ఈ ఎన్నికల్లో చంద్రబోస్ కుమారుడికి జగన్ టికెట్ ఇచ్చారు. అందుకే తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని చంద్రబోస్ ప్రకటించారు.
* కడప జిల్లాకు చెందిన మేడ రఘునాథ్ రెడ్డి సైతం తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈయన జగన్ కు వీర విధేయుడు. అయితే ఈయన సోదరుడికి ఈసారి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. సోదరుడు అసంతృప్తితో ఉన్నా తాను మాత్రం పార్టీ మారేది లేదని రఘునాథ్ రెడ్డి ప్రకటించారు.
* ఇక న్యాయవాది నిరంజన్ రెడ్డి సైతం తాను పార్టీ మారనని ప్రకటించారు. ఆయన పార్టీ మారే ఛాన్స్ కూడా లేదు. ఆది నుంచి జగన్ కేసులను నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు. పెద్దల సభకు వెళ్లాలన్న కోరికను జగన్ మన్నించారు. తన కోరిక తీరిందని రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని నిరంజన్ చెబుతున్నారు.
* గుజరాత్ కు చెందిన పరిమల్ నత్వానికి పిలిచి మరి జగన్ ఛాన్స్ ఇచ్చారు. పార్టీ తరపున పోటీ ఉన్నా పారిశ్రామికవేత్త రిక్వెస్ట్ చేయడంతో అవకాశం ఇచ్చారు. ఈయన బిజెపికి సన్నిహిత వ్యక్తి. పేరుకే వైసీపీ కానీ బిజెపికి అనుబంధంగా ఉంటారు. అందుకు వైసిపి కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అందుకే ఆయన సైతం వైసీపీలోనే ఉంటాం అంటున్నారు.
* ఇక ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీలోనే కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సోదరుడు. ఈయన పార్టీ మారుతారని ప్రచారం సాగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
* ఆ ఇద్దరూ ఖండించలే
అయితే ఓ ఇద్దరు ఎంపీలు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. తాము పార్టీలు మారుతామని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడం లేదు. విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబురావు ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉండగా.. జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారు. రాజ్యసభ పదవి ఇచ్చారు. అయితే విస్తరణ సమయంలో మంత్రి పదవి కోసం గలాటా చేశారు. పదవి దక్కక పోయేసరికి బాధపడ్డారు. అసంతృప్తితో రగిలిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ నుంచి రాజ్యసభకు వైసిపి ద్వారా ప్రమోట్ అయ్యారు ఆర్ కృష్ణయ్య. చంద్రబాబుతోమంచి సంబంధాలు ఉండేవి. తెలంగాణ నుంచి టిడిపి ఎమ్మెల్యేగా కూడా ఉండేవారు. అప్పట్లో జగన్ పిలిచి మరి ఈయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు. అప్పుడు ఎందుకు ఇచ్చారో తెలియదు. తరచూ పార్టీలు మారే కృష్ణయ్య వైసీపీలో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీ మారుతారన్న ప్రచారాన్ని ఖండించడం లేదు. సో ఇప్పుడున్న సమాచారం మేరకు ఆ ఇద్దరూ వైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.